Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక చట్టం లేక కల్తీ విత్తనాలతో నష్టం
- అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని అఖిల భారత కిసాన్‌సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారామ ఫంక్షన్హాల్లో తెలంగాణ రైతు సంఘం విస్తృత స్థాయి సమావేశాల సందర్భంగా శనివారం 'వ్యవసాయరంగం-సవాళ్లు' అంశంపై ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సెమినార్లో సారంపల్లి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నేడు వ్యవసాయ రంగం అనేక ఇబ్బందులకు గురవుతుందన్నారు. రాష్ట్రంలో అవసరాలకు అనుగుణంగా పంటలను వేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 11 లక్షలు టన్నుల కూరగాయలతో పాటు వంటనూనెలు, పంచదార, సుగంధ ద్రవ్యాలు కూడా దిగుమతి అవుతున్నాయన్నారు. విత్తనోత్పత్తి ద్వారా మన రాష్ట్రానికి మంచి ఆదాయం అందుతుందని, ప్రపంచంలో చాలా దేశాలకు విత్తనాలు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. ఇందుకు ప్రత్యేక చట్టం లేకపోవడంతో కల్తీ విత్తనాలు రాష్ట్ర రైతాంగాన్ని నష్ట పరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో నాణ్యతలేని విత్తనాలతో, మరోవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా నష్టం జరుగుతుందని తెలిపారు. గత సంవత్సరం 12 లక్షల 65 వేల ఎకరాల్లో నష్టం జరిగితే, ఈ ఏడాది వానాకాలంలో 8 లక్షల 75 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. తామర, గులాబీ తెగుళ్లతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని 14, 15 ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధులను ఖర్చు చేయటం లేదని అన్నారు. పాసు పుస్తకాల్లో లోపాల వల్ల ఇంకా 12 లక్షల మంది సన్న చిన్నకారు రైతులకు రైతుబంధు అందడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. పంటల బీమా అనేది 18 నుంచి 59 ఏండ్ల మధ్య ఉన్న వారికే ఇస్తున్నారన్నారు. కానీ, 75 ఏండ్లు దాటినా రైతులు వ్యవసాయ పనులు చేస్తున్నారని, వాళ్లకీ బీమా వర్తింపజేయాలని కోరారు. వ్యవసాయ రుణాలు మాఫీ కాక.. రైతులకు కొత్త రుణాలు లభించడం లేదని అన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ముఖ్యంగా కౌలు రైతును ప్రభుత్వం గుర్తించకపోవడ ంతో దారుణమన్నారు. విస్తతస్థాయి సమావేశాల ప్రారంభ సూచికగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెసర కాయల జంగారెడ్డి జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, రాష్ట్ర అధ్యక్షులు పి.జంగారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి, మూడ్ శోభన్, మాదినేని రమేష్, బండ శ్రీశైలం, నక్కల యాదవరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కూన్‌రెడ్డి నాగిరెడ్డి, నున్న నాగేశ్వరరావు, కున్సోత్ ధర్మా, కుమారస్వామి, బాల్‌రెడ్డి, ఎం.శ్రీనివాసులు, మంగ నరసింహా, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుర్రి శ్రీరాములు, దండ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొప్పుల రజిత తదితరులు పాల్గొన్నారు.