Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ విద్యా కమిషనర్ చాంబర్లో టిప్స్ నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ విద్యాశాఖ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) డిమాండ్ చేసింది. ఇంటర్ విద్యా కమిషనర్ చాంబర్లో శనివారం నేలపై కూర్చొని నిరసన చేపట్టారు. అనంతరం కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్‌ను టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆర్జేడీ మల్టీజోన్-2 కార్యాలయంలో ఇంటర్ కమిషనర్ సిబ్బంది కాకుండా మల్టీజోన్-2 పరిధిలో పనిచేస్తున్న సిబ్బందినే నియమించాలని కోరారు. 317 జీవో ప్రకారం మల్టీజోన్లు మారిన జూనియర్ లెక్చరర్లను అన్యాయంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొని స్పౌజ్, ఇతర అప్పీళ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బోధనేతర సిబ్బందికి పది శాతం కోటాలో జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలని సూచించారు. ఇంటర్ విద్యలో ఉద్యోగులందరికీ బదిలీలు చేపట్టాలని కోరారు. విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను చేయించేందుకు పరికరాల కొనుగోలుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని సూచించారు. పరీక్షల విధుల్లో సీనియార్టీని పాటించాలని తెలిపారు. కాంట్రాక్టు అధ్యాపకులను టీడీఎస్ పరిధిని 192కు మార్చాలని కోరారు. వేతనాల చెల్లింపుల్లో డీడీవోలు, ప్రిన్సిపాళ్లకు ఆదేశాలివ్వాలని పేర్కొన్నారు. అతిధి అధ్యాపకుల వేతనాలను విడుదల చేయాలని తెలిపారు. ఈ సమస్యలపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉద్యోగ సంఘాలు, అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.