Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం, అధికారులు సహకరించాలి
- :శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి అంశంపై సమగ్రంగా చర్చ జరగాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రభుత్వం, అధికారులు సహకరించాలని కోరారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం స్పీకర్ విలేకర్లతో మాట్లాడారు. మార్చి 7 నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. శాసనసభ సమావేశాల హుందాతనాన్ని కాపాడుకుంటూ, ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి గత సమావేశాల మాదిరిగానే సహకరించాలని కోరారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. గత సమావేశాల్లో వచ్చిన ప్రశ్నలకు జవాబులు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటికి వెంటనే జవాబులు పంపించాలని చెప్పారు. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ ఇంకా పూర్తిగా పోనందున మాస్క్ దరించడంతోపాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరికైనా కరోనా లక్షణాలుంటే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సభలు ప్రశాంతంగా జరగాలంటే, పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలన్నారు. అందుకు పోలీసు శాఖ పూర్తి సహాయ, సహకారమందించాలని కోరారు. ఈ సమావేశంలో శాసనమండలి ప్రొటెం చైర్మెన్ జాఫ్రి, చీఫ్‌విప్ దాస్యం వినరు భాస్కర్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులు, సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకష్ణారావు, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమీషనర్ స్టిఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగత్, ఇంటలిజెన్స్ డీఐజీ శివకుమార్, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్ కరుణాకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.