Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైలెట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో..
- విమర్శలు చేసే వారికి అభివృద్ధి కనిపించడం లేదు : ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్
నవతెలంగాణ - వేములవాడ/ఎల్లారెడ్డిపేట
ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ - హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం మంత్రి పర్యటించారు. ముందుగా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. వెంకటాపూర్లో డబుల్బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం చేశారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఈ-హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం డిజిటలైజేషన్ చేసి, ఆరోగ్య వివరాలను సమగ్రంగా పొందుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఈ-హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో అమలు చేస్తున్నట్టు చెప్పారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరి రక్త నమూనాలను సేకరించి, పరీక్షించిన అనంతరం వారి పూర్తి ఆరోగ్య వివరాలను ఆన్లైన్లో భద్రపరుస్తామన్నారు. ఆరోగ్య సమస్యలు, వివరాలను తెలిపేందుకు డిజిటల్ కార్డును అందజేస్తామన్నారు. జిల్లాలో 220 బృందాలు ఈ కార్యక్రమంలో నిమగమవుతాయని చెప్పారు. రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తామన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక దేశంలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో అగ్రస్థానంలో నిలిచిందని.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చాలాసార్లు ప్రకటించిందని చెప్పారు. విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు అభివృద్ధి కనిపించడం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు, నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాల అమలుపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, టెస్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్రావు, కలెక్టర్ అనురాగ్ జయంతి, జెడ్పీ చైర్పర్సన్ అరుణారాఘవరెడ్డి పాల్గొన్నారు.