Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ డాంబికాలకు పోతారా...?
- రాష్ట్ర బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి
- మొత్తం కేటాయింపులు రూ.2.50 లక్షల కోట్లకు పైనే అంటూ ప్రచారం
- అందరి చూపు బడ్జెట్ వైపే
బి.వి.యన్.పద్మరాజు
తెలంగాణ వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ (2014-15) రూ.1,02,172 కోట్లు. ఆ యేడాది వాస్తవ ఖర్చు రూ.62,786 కోట్లు. అప్పటి నుంచి అన్ని బడ్జెట్లదీ అదే పరిస్థితి. అంచనాలు ఘనంగా వేసుకుంటూ పోవటం, ఖర్చు మాత్రం తక్కువగా ఉండటం కేసీఆర్ సర్కారుకు షరా మామూలుగా మారింది. 2019-20 వార్షిక బడ్జెట్లో సైతం ఆదాయ అంచనాలు రూ.1,46,492 కోట్లుగా వేసుకుంటే, వాస్తవ ఆదాయం మాత్రం రూ.1,32,509 కోట్లే. ఈ రకంగా చూసినప్పుడు గత ఏడు బడ్జెట్లలో టీఆర్ఎస్ సర్కారు... నేల విడిచి సాము చేసినట్టుగా కనబడుతున్నది. ఈ క్రమంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సోమవారం ప్రవేశపెట్టబోయే పద్దుకు సంబంధించైనా... రాష్ట్ర ప్రభుత్వం హద్దు మీరకుండా ఉంటుందా..? లేదా తన అలవాటు ప్రకారం డాంబికాలకు పోయి బడాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందా..? అనేది చూడాలి. అయితే సర్కారు పెద్దలు ఇచ్చిన లీకుల ప్రకారం... ఈసారి కూడా బడ్జెట్లో గణాంకాలను ఘనంగా చూపించబోతున్నారని సమాచారం. మొత్తం పద్దు రూ.2.50 లక్షల కోట్లకు పైబడే ఉంటుందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతుండటం గమనార్హం. అయితే ఏయే రంగాలకు ఈసారి ప్రాధాన్యతనివ్వబోతున్నారనే దానిపై చర్చోప చర్చలు కొనసాగుతున్నాయి.
గతేడాది వివిధ రాజకీయ కారణాలు, ఉప ఎన్నికల రీత్యా ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకానికి లబ్దిదారుల ఎంపికలో అధికార పార్టీ జోక్యం పెరిగిపోవటంతో అర్హులకు న్యాయం జరగటం లేదనే వాదన వినపడుతున్నది. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయటానికి వీలుగా చాలినన్ని నిధులు కేటాయించాల్సి ఉంది. మరోవైపు నిధుల విడుదల అనేది ఒకేచోట కేంద్రీకృతమైందన్న భావన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో పారదర్శకంగా పాలన సాగేందుకు, క్షేత్రస్థాయిలో అసలైన లబ్దిదారులకు ఫలాలు అందేందుకు వీలుగా 'ఫండ్ రిలీజ్' అనే ప్రక్రియను వికేంద్రీకరణ చేయాలనే వాదన వినబడుతున్నది. ఇదే సమయంలో హాస్టళ్ల మెస్ బిల్లుల నుంచి కాంట్రాక్టర్ల చెల్లింపుల వరకూ ప్రతీ చెక్కుకూ ఆర్థికశాఖ నుంచి ధృవీకరణ (అప్రూవల్) రావాలనే నిబంధన విధించటం సరైంది కాదని పలువురు అధికారులు సూచిస్తున్నారు. ఒక పథకం లేదా కార్యక్రమానికి ఒకసారి నిధులు మంజూరైన తర్వాత వాటి విడుదలకు అనేక కొర్రీలు వేయటం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఫలితంగా పనుల్లో తీవ్రమైన జాప్యం చోటు చేసుకుంటున్నదని తెలిపారు. మరోవైపు ప్రభుత్వ సబ్సిడీలు, రాయితీల మీద ఆధారపడే పేదలు, సాధారణ ప్రజలకు అమలయ్యే పథకాలకు నిధులను సకాలంలో విడుదల చేయటం ద్వారా ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సి ఉంది. ఆరోగ్యశ్రీ, కేసీఆర్ కిట్, ఫీజు రీయింబర్స్మెంట్, వ్యవసాయ సబ్సిడీలు, విద్యుత్ (వృత్తిదారులు) రాయితీలు, మెస్ బిల్లులు తదితరాలకు ఎప్పటికప్పుడు డబ్బును విడుదల చేయటం ద్వారా ఆయా పథకాలు ఆగిపోకుండా, వాటి సేవలు నిరాకరించకుండా చూడాలి. అప్పుడే వారికి అసలైన మేలు జరుగుతుంది. వీటితోపాటు కీలకరంగాలైన విద్య, వైద్యానికి ప్రతీయేటా నిధుల కేటాయింపులు ఘనంగా ఉంటున్నా... పూర్తి స్థాయిలో వాటిని ఖర్చు చేయటం లేదు. దీంతో అనుకున్న రీతిలో ఫలితాలు రావటం లేదు. ఇలాంటి అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలించుకోవాల్సి ఉంది. మొత్తం మీద 2023 డిసెంబరులో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టబోయే బడ్జెట్... అటు ఆయన ప్రభుత్వానికి, ఇటు టీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకమనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం వండివార్చే పద్దు ఎలా ఉంటుందో వేచి చూద్దాం.