Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్ఐసీ ఐపీఓను ఉపసంహరించుకోవాలి
- ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజలే కాపాడుకోవాలి
- ఐసీఇయూ కరీంనగర్ నేత వెంకటరమణ
నవతెలంగాణ- కరీంనగర్ టౌన్
అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్త ఎల్సీఐని ప్రయివేట్ పరం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, వెంటనే ఐపీవోను ఉపసంహరించుకోవాలని ఏఐఐఈఏ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ అన్నారు. భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలో ఐపీఓ ద్వారా వాటాల విక్రయం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎల్ఐసీ ఉద్యోగులు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఐసీఈయూ) కరీంనగర్ కార్యదర్శి వెంకటరమణ, అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజలే పోరాడి కాపాడుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎల్ఐసీలో వాటాల విక్రయానికి వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నాకు పిలుపునిచ్చినట్టు చెప్పారు. ఎల్ఐసీ ప్రయివేట్‌పరం పట్ల ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు, పెన్షన్ సంఘాలు, బ్యాంకు సంఘం, ఇతర సంఘాలు నిరసన తెలుపుతున్నాయన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా దేశ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను గంపగుత్తగా అమ్మే దుర్మార్గానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహాధర్నాలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రామ్ మోహన్‌రావు, రవీంద్రనాథ్, సూర్యకళ, ఆనందం, బసవేశ్వర్, శ్రీదేవి, ప్రభాకర చారి, శ్రీనివాస్, నరేందర్, రాజేశ్వర్, రాజనర్సింగ్ రావు, సభ్యులు పాల్గొన్నారు.
ఇతర సంఘాల మద్దతు
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సత్యం, సీపీఐ జిల్లా కార్యదర్శి కేదారి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, రైతు సంఘం నాయకులు రాజిరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సమ్మయ్య, మెడికల్ రిప్రజెంటేటివ్ సంఘం నాయకులు సదానంద చారి, జై భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రయ్య ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి లక్ష్మీకాంతం, యూఎఫ్‌బీయూ బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు దామోదర్, జీఐసీ పెన్షనర్స్ సంఘం నాయకులు రాజేశం, కాంగ్రెస్ దళిత విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజమల్లయ్య ఎల్ఐసీ ఉద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.