Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తాం
- ధరణి పోర్టల్‌తో రెవెన్యూ వ్యవస్థ చిన్నాభిన్నం
- ప్రజాభివృద్ధి, సంక్షేమ బడ్జెట్‌గా ఉండాలి
- 'నవతెలంగాణ'తో కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క
- అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పీపుల్స్ మార్చ్‌కు బ్రేక్
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భూస్వామ్య వ్యవస్థ పునర్నిర్మాణమే కేసీఆర్ ధ్యేయంగా ఉందని కాంగ్రెస్‌పార్టీ శాసనసభ పక్షనేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ధరణి పోర్టల్‌తో రెవెన్యూ వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం ఛిన్నాభిన్నం చేసిందన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాల్లో గతంలో ఉన్న వివిధ కాలమ్స్‌ను తొలగించి అసైన్డ్ హక్కుదారులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నదని అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న 'పీపుల్స్ మార్చ్' పాదయాత్రకు శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తాత్కాలిక విరామం ఇస్తున్నట్టు ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే యథావిధిగా పాదయాత్ర కొనసాగిస్తానన్నారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శనివారం ఆయన ముదిగొండ మండలం పెద్దమండవ వద్ద 'నవతెలంగాణ'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు భట్టి మాటల్లోనే..
ధరణి ఫోర్టల్‌తో ఇబ్బందులు..
ఈసారి బడ్జెట్ అయినా ప్రజాభివృద్ధి, సంక్షేమ బడ్జెట్‌గా ఉండాలని కాంక్షిస్తున్నాను. ధరణి సమస్యలపై బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావిస్తాను. తెలంగాణ ఆశల సాధనకు అనుగుణంగా బడ్జెట్ ఉండాలన్నారు. ధరణి వైఫల్యం కారణంగానే గతంలో ఓ తహసీల్దార్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. ఇప్పుడు రియల్టర్ల జంట హత్యలకూ ధరణి పోర్టలే కారణం. తోడర్మల్(షేర్షా చక్రవర్తి) కాలం నుంచి పట్టాదారు పాసుపుస్తకాల్లో వివిధ కాలమ్స్ ఉండేవి. ధరణి పోర్టల్ మూలంగా ఇప్పుడవన్నీ తీసేశారు. గతంలో ఉన్న కబ్జా, పట్టా, అనుభవదారు, ఇనాం, అసైన్డ్, మాన్యం.. తదితర కాలమ్స్‌ను తొలగించి పట్టాదారు కాలంను మాత్రమే ఉంచారు. అసైన్డ్ హక్కుదారులకు భూమిపై హక్కు లేకుండా చేశారు. ధరణి ఫోర్టల్ ఇబ్బందులపైనా తన పాదయాత్రలో ప్రజలనుంచి ఎక్కువగా వినతిపత్రాలు వచ్చాయి. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తా. అసైన్డ్‌దారులకు న్యాయం జరిగేలా చూస్తాం. భూస్వామ్య వ్యవస్థ పునర్నిర్మాణమే ధ్యేయంగా మళ్లీ జమీందారి వ్యవస్థలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న సీఎం కేసీఆర్ ప్రయత్నాలు సాగనివ్వం.
రైతుల సమస్యలపై మాట్లాడతా
7వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించాను. ఇప్పటి వరకు 102.2 కి.మీ పాదయాత్ర నిర్వహించాను. ఈ పాదయాత్ర సందర్భంగా రైతులు పడుతున్న ఇబ్బందులను చూశాను. నకిలీ విత్తనాలు, బిందు సేద్యం, పావలా వడ్డీ రుణాలు ఇవేవీ రైతులకు అందకుండా పోయాయని వీటిపైనా మాట్లాడుతాను. నకిలీవిత్తనాలు, తామరనల్లి కారణంగా ఒక్కో మిర్చి రైతు రూ.2లక్షల వరకు నష్టపోయాడు. బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ఈ సమావేశాల్లో లేవనెత్తుతా.
ఇచ్చిన హామీలకు అనుగుణంగా కేటాయింపులు
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, నిరుద్యోగ సమస్య, భృతి, పెన్షన్ సమస్యలు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు తదితర అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా. బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ ప్రజలకు నిరాశ తప్పడం లేదు. మంత్రి హత్యకు సుఫారి చెల్లించారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా క్షీణించాయో అర్థం చేసుకోవాలి. ఇచ్చిన హామీలకనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి. వీటన్నింటిపై బడ్జెట్ సమావేశంలో ప్రస్తావిస్తా.. ప్రజలు, రైతులకు న్యాయం జరిగేలా చూస్తా.