Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్ట పరిహారం ఇచ్చే వరకు భూమిని వదలం
- రైతులకు పోలీసుల మధ్య తోపులాట
- గాయపడిన రైతులు
నవతెలంగాణ-మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేసేందుకు నిర్మిస్తున్న రైల్వే లైన్ నిర్మాణ పనులను శనివారం రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భూములు కోల్పోతున్న రామానుజవరం, తిర్లాపురం గ్రామాల రైతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇంటికో ఉద్యోగం ఇచ్చే వరకూ భూములను వదులుకోబోమని హెచ్చరించారు. భారీ స్థాయిలో భూ నిర్వాసితులు పనులను అడ్డుకోవడంతో మణుగూరు ఏఎస్పీ శభారీష్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో మహిళా పోలీసులు, స్పెషల్ బలగాలు మోహరించారు. భూ నిర్వాసితులను అరెస్టు చేశారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడంతో భూ నిర్వాసితులు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బొగ్గుల బేబి స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలించారు. సుమారు 30 మంది భూ నిర్వాసితులను అరెస్టు చేశారు. వారం రోజుల పాటు రైల్వే లైన్ నిర్మాణ పనులను నిలిపేస్తామని, రెవెన్యూ, రైతులు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని పోలీసులు చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. రెవెన్యూ సిబ్బంది నుంచి జాయింట్ కలెక్టరు వరకు అసమర్దత వల్లే తమకు న్యాయం జరగలేదని వాపోయారు. రెవెన్యూ అధికారులు సమావేశాలు జరిగినప్పుడల్లా సరైన, మెరుగైన ప్యాకేజీలు ఇస్తామని హామీలు ఇచ్చారే తప్పా అమలు చేయకుండా మోసం చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా భద్రాద్రి పవర్ ప్లాంట్ ప్యాకేజ్ తమకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
భూ నిర్వాసితులకు మద్దతుగా జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ గడిపల్లి కవిత, కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ కన్వీనర్ చందా సంతోష్‌కుమార్, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐఎంఎల్ ప్రజాపంథా నాయకులు మద్దతు తెలిపారు.