Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశాలకెళ్తున్న వైద్యవిద్యార్థులు
- ఎస్వీకే వెబినార్లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగినంత ప్రోత్సాహం లేనందువల్లే వైద్యవిద్యార్థులు, వైద్యులు విదేశాలకెళ్తున్నారని వక్తలు పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్.వినరు కుమార్ సమన్వయకర్తగా వైద్యవిద్య కోసం మన విద్యార్థులు విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు? అనే అంశంపై ఆదివారం వెబినార్ నిర్వహించారు. ఈ వెబినార్లో ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం (పీడీఏ) కన్వీనర్ డాక్టర్ కె.లింగారెడ్డి, హెల్త్ కేర్ రిఫార్మ్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) అధ్యక్షులు డాక్టర్ కె.మహేష్ కుమార్ ప్రసంగించారు. వైద్యవిద్యను, ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం పట్ల ప్రభుత్వాలు శ్రద్ధ కనబరచడం లేదని అభిప్రాయపడ్డారు.
డాక్టర్ కె.లింగారెడ్డి మాట్లాడుతూ యుక్రెయిన్లో వైద్యవిద్య కోసం వెళ్లిన 18 వేల మంది విద్యార్థుల సంక్షోభానికి సంబంధించిన మూలాలను గుర్తించాలని కోరారు. మన దేశంలో ఎంబీబీఎస్ విద్య కోసం 2021లో 15 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 13 నుంచి 14 లక్షల మందికి సీటు రాలేదనీ, వారంతా ఎటు వెళుతున్నారనే విషయాన్ని ఆలోచించాలన్నారు. ప్రయివేటు కళాశాలల్లో చదువుకయ్యే అధిక ఖర్చు కూడా విద్యార్థులు విదేశాల్లో మొగ్గు చూపించేందుకు కారణమవుతున్నదని విశ్లేషించారు. వైద్యవిద్య అభ్యసించిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి తగిన స్థాయిలో నియామకాలు లేకపోవడంతో డాక్టర్లు కూడా విదేశాలకు వెళ్లేందుకే ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మొదలు బోధనాస్పత్రుల వరకు తగిన సంఖ్యలో డాక్టర్లు, నర్సుల పోస్టులను భర్తీ చేయకపోవడం, భర్తీ చేసే కొద్ది పోస్టులు సైతం కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తూ నిరుత్సాహానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పేరుతో ప్రయివేటు వైద్యాన్ని, వైద్యవిద్యను ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. మెడికల్ పీజీ సీట్ల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరముందనీ, ఇందుకోసం బెడ్లు, మౌలిక వసతులు, సిబ్బంది, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
డాక్టర్ కె.మహేష్ కుమార్ మాట్లాడుతూ వైద్యవిద్యను అభ్యసించే ఆసక్తి ఎక్కువగా మధ్యతరగతి, పేద వర్గాల వారికే ఉందన్నారు. ఉత్తర భారతదేశం, ఈశాన్య ప్రాంతాల్లో ఇప్పటికీ ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య తక్కువగా ఉందని తెలిపారు. వైద్యవిద్య కోసం విదేశాలకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను ఆదుకునేందుకు అక్కడ కాలేజీలు, సీట్లు పెంచాలని సూచించారు. విదేశాలకు పంపించే ముందు తల్లిదండ్రులు అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు. దేశంలో నకిలీ డాక్టర్ల సమస్యను పరిష్కరించాలనీ, ఇందుకోసం వైద్యవిద్యను, డాక్టర్లను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. నియమకాలను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.