Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కవితా వస్తువుతో ఘర్షించాల్సిందే
- సాహిత్య పాఠకులు తగ్గడం ఆందోళనకరం
- విచ్ఛిన్నభూతం(సెల్‌ఫోన్)తో ఎక్కువకాలం గడుపుతున్న పరిస్థితి
- జీవనయాత్ర పుస్తకావిష్కరణలో మేడ్చల్ అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కవిత్వం గొప్ప ఊహ అని మేడ్చల్ అదనపు కలెక్టర్, కవి ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. కవి తన భుజకీర్తిలు, హోదాలు, భేషజాలు వదిలి భాషాజ్ఞానంతో ఊహల్లో వస్తువుతో ఘర్షించే కొద్దీ అద్భుతమైన కవిత్వం పురుడుపోసుకుంటుందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో 'జీవనయాత్ర' కవితల సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బెంగాల్లో కవి శరత్చంద్ర చటోపాధ్యాయ రచించిన అనేక రచనలు తెలుగులోకి అనువదించబడ్డాయనీ, దేవదాసు, పార్వతిల ప్రేమను మన మనస్సుల మీద చెరగని ముద్ర వేసేలా చేసిన ఘనత ఆయనదని కొనియాడారు. గొప్ప అధ్యయనశీలత, సాహిత్య స్పృహ ఉన్న తరం 30-40 ఏండ్ల కింద ఉండేదన్నారు. నేటి కాలంలో సాహిత్య పాఠకుల సంఖ్య తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి టీవీనే కారణమనే ఆలోచన నుంచి మనం బయటపడాలన్నారు. ఇప్పుడు విచ్ఛిన్నభూతం(సెల్‌ఫోన్)తో ప్రతిఒక్కరూ గంటల తరబడి గడుపుతున్న పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. మనకున్న భావాలు, అభిప్రాయాలు వ్యక్తీకరించే విధానం వల్ల అవి ముందు తరానికి పోతాయి తప్ప ఒక మాధ్యమాన్ని నమ్ముకునే తీసుకుపోలేమని నొక్కి చెప్పారు. ఒక వస్తువు స్వభావాన్ని మార్చగలిగే శక్తిమంతుడైన కవి రాసే కవిత చిరకాలం నిలిచిపోతుందన్నారు. శరత్ తన కవిత్వంలో 'కరోనా' అనే ఏక వస్తువులో భిన్నత్వాన్ని చూపి అద్భుతంగా కవిత్వాన్ని రాశారని ప్రశంసించారు. తన కవిత్వంలో మూఢత్వాన్ని వ్యతిరేకిస్తూ సైన్స్ ప్రాధాన్యతను చెప్పిన తీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. ప్రయివేటు టీచర్లు పడ్డ యాతన, వలసజీవుల గోడు, ఇలా సమాజాన్ని విస్తృతంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయడం వల్లనే వాటిని కవితా వస్తువుగా మలచగలిగాడనేది అక్షరసత్యమని చెప్పారు. పేదల పక్షపాతం వహించే ధోరణి శరత్ సుదర్శి కవిత్వంలో కనిపించిందనీ, మార్క్సిజం పట్ల అవగాహన, అధ్యయనం ఉన్న వ్యక్తుల్లోనే అది ఉంటుందని ప్రశంసించారు. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు పుస్తకాలు చదవడం, కొత్త వ్యక్తులను కలవడం, కొత్త ప్రదేశాలను సందర్శించడం లాంటి పనులు నిత్యం చేయాలని సూచించారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నవతెలంగాణ దినపత్రిక ఎడిటోరియల్ బోర్డు సభ్యులు కె.ఆనందాచారి మాట్లాడుతూ..కరోనాకాలంలో సేవా కార్యక్రమాలు చేసే క్రమంలో సామాన్యుల ఇక్కట్లను కండ్లార చూసిన తర్వాత శరత్లో దాగిఉన్న కవిహృదయం బయటపడిందనీ, అందులో నుంచి పుట్టుకొచ్చిందే జీవనయాత్ర పుస్తకం అని కొనియాడారు. మనిషి తనకు తాను కాకుండా ఇతరులు, సమాజం బాగోగులు గురించి ఆలోచించాలన్నారు. దీనిని మార్క్స్ ఏనాడో చెప్పాడన్నారు. రాయాలనే కోరిక చాలా బలమైనదనీ, ఎలా భావవ్యక్తీకరణ చేయాలనేది తర్వాత కాలక్రమంలో నేర్చుకోవచ్చునని చెప్పారు. ఒకే వస్తువు..ఒకే కాలం అయినప్పటికీ వ్యక్తి చూసే కోణంలో తేడా ఉంటుందన్నారు. శ్రమతో చేసిన ప్రతి వస్తువూ ఆదరణకు నోచుకుంటుందన్నారు. మేధోపరమైన శ్రమ ద్వారా ఉత్పత్తి అయ్యేది కవిత్వమన్నారు. మోదుగుపూలు ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు 'జీవనయాత్ర' పుస్తక పరిచయాన్ని చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత మెర్సీ మార్గరెట్ మాట్లాడుతూ..కరోనా కాలంలో శరత్‌లోని మానసిక సంఘర్షణ నుంచి మంచి కవిత్వం వచ్చిందన్నారు. ఒకే వస్తువుతో ప్రతి అంశాన్నీ సృజిస్తూ 40 కవితలు రాయడం మామూలు విషయం కాదన్నారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంతోజు మోహన్‌కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తితో పాటు శాంతారావు, నస్రీన్‌ఖాన్, మహేష్దుర్గే, సలీమ, బురాన్, జి.నరేశ్, తదితరులు పాల్గొన్నారు.