Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్మరణ సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిరంతరం పేదల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించారనీ, ఈ క్రమంలో అనేక సార్లు పోలీసు నిర్భంధాన్ని అనుభవించారనీ, అందుకే ఆయన పేదల పక్షపాతిగా నిలిచారని ఎంసీపీఐ(యు) మాజీ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ సంస్మరణ సభలో వక్తలు తెలిపారు.ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అధ్యక్షతన సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐ(యు) జాతీయ కార్యదర్శి మద్దికాయల అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములు కబ్జాదారులకు దక్కకుండా పేదలకు ఉపయోగపడేలా ఉద్యమాలు నిర్వహించారని చెప్పారు. ఈ క్రమంలో భూకబ్జాదారులు 40కేసులకు పైగా భనాయించారన్నారు. అయినా ఏ మాత్రం పట్టుదలను సడలలేదని చెప్పారు. ఎర్రజెండా అన్నా..పేదలన్నా..ఆయనకు అమితమైన ప్రేమని తెలిపారు. అతి తక్కువ కాలంలోనే పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగాడని చెప్పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను దూకుడుగా అమలు చేస్తున్నాయనీ, ఇట్లాంటి సమయంలో తాండ్ర కుమార్ లేకపోవటం కమ్యూనిస్టు ఉద్యమాలకు నష్టమన్నారు. అంగీకారం కుదిరిన సమస్యలపై ఐక్యఉద్యమాలు నిర్మించాలని చెప్పారు. ప్రజల్లో కమ్యూనిస్టుల పట్ల విశ్వాసాన్ని పెంచాలన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో కార్పొరేట్ రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పారు.
చట్ట సభలు సెంట్మెంట్, తిట్ల సభలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్లు లాభాలు అర్జిస్తుంటే..శ్రమజీవులు కష్టాల పాలవుతున్నారని తెలిపారు. సీపీఐ(ఎంఎల్ )ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ బలమైన వర్గపోరాటాలు నిర్మించటమే తాండ్రకుమార్కు నిజమైన నివాళి అని చెప్పారు. అరుణోదయ విమలక్క, ఎస్‌యుసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురహరి,సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్, బీసీపీ రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు, ఎంసీపీఐ(యు) కేంద్ర కమిటి సభ్యులు సుదీప్,వల్లెపు ఉపేందర్‌రెడ్డి, కాటం నాగభూషణం, బీఎల్ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్ ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులతో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.