Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో..
- : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ
నవతెలంగాణ-భువనగిరి
రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.5 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించి గీత కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ డిమాండ్ చేశారు. ఆదివారం యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రంలోని వైఎస్ఆర్ గార్డెన్లో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజుగౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. విధానాల వల్ల బహుళజాతి కంపెనీల ఉత్పత్తుల దాటికి తట్టుకోలేక కల్లు అమ్మకాలు పడిపోయాయనీ, క్రమంగా వృత్తి చేసే కార్మికులు తగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకుదెరువు కోసం ఇతర పనులు వెతుక్కుంటూ పట్టణాలకు వలస బాట పడుతున్న గీత కార్మికులను ఆదుకునేలా వృత్తిలో ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఒక కోటి తాటి, ఈత చెట్లు ఉన్నాయనీ, 4558 గీత కార్మిక సహకార సంఘాల్లో 2.30లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్నారని తెలిపారు. సభ్యత్వం లేకుండా వృత్తి చేసేవారు లక్షల్లో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీ.. తయారీదారులు, లిక్కర్ షాప్ యజమానులకు లక్షల రూపాయల ఆదాయం వస్తుందనీ, అంతేకాక ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరుతుందని తెలిపారు. కానీ గీత కార్మికులు మాత్రం.. తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వృత్తి చేస్తున్నారని అన్నారు. చెట్టుపై నుండి జారి కింద పడి మృతి చెందడం లేదా వికలాంగులుగా మారడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఎనిమిదేండ్ల కాలంలో ఐదు వేలమంది ప్రమాదాలకు గురయ్యారనీ, వీరిలో 600 మంది చెట్లపై నుంచి జారిపడి మృతి చెందారని, 4400 మంది వికలాంగులయ్యారని వివరించారు. కానీ వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం, సాయం అందడం లేదని తెలిపారు. ప్రతి సొసైటీకి ప్రభుత్వమే భూమి కేటాయించి హైబ్రిడ్ తాటి, ఈత, ఖర్జూర మొక్కలు సరఫరా చేసి నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కల్లులో అనేక పోషకాలు ఉన్నాయని, కాన్సర్ వంటి రోగాలు రాకుండా, మూత్రపిండాల్లో రాళ్లను తొలగిస్తుందని జాతీయ పోషకాహార సంస్థ తెలిపిందని గుర్తుచేశారు. ఈ విషయాలను ప్రభుత్వం ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండిస్తున్నామన్నారు. దీని వెనకాల ఉన్న రాజకీయ శక్తులను బయటకు తీసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు ఎల్గూరి గోవిందు, బోలగాని జయరాములు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, చౌగోని సీతారాములు, బూడిద గోపి, బాల్నే వెంకట మల్లయ్య, పామనగుండ్ల అచ్చాలు, వెంకట నరసయ్య, బండకింద అరుణ్, భావండ్లపల్లి బాలరాజు, చంద్రయ్య, మద్దెల రాజయ్య పాల్గొన్నారు.