Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- పార్టీ సీనియర్ నాయకుడు వసంతరావు సంతాపసభ
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పాకలపాటి వసంతరావు భావజాలాన్ని ప్రతి కమ్యూనిస్టు ఆదర్శంగా తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కమ్యూనిస్టు ఎలా ఉండాలి అనేందుకు వసంతరావు జీవనశైలిని తెలుసుకుంటే సరిపోతుందన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో జరిగిన పాకలపాటి వసంతరావు సంతాపసభలో తమ్మినేని పాల్గొని ప్రసంగించారు. సత్తుపల్లి ప్రాంతంలో మహామహులను ఎదురొడ్డి ఎర్రజెండాను నిలబెట్టిన ఘనత వసంతరావుదన్నారు. ఆయన మరణం సీపీఐ(ఎం)కు తీరని లోటన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా కమ్యూనిస్టులు నడుచుకోవడమే ఆయనకు మనమిచ్చే నివాళి అని తెలిపారు. రాష్ట్ర నాయకులు మన్నేపల్లి సుబ్బారావు మాట్లాడుతూ.. పార్టీలో పనిచేసే వారిపై ఎప్పుడు దాడులు జరుగుతాయోనని భయపడుతున్న రోజుల్లో కార్యకర్తలు, నాయకులకు రక్షణగా వసంతరావు నిలవడమే గాక తన ఇంటిలోనే ఆశ్రయం ఇచ్చిన గొప్ప కమ్యూనిస్టు నాయకుడు అని కొనియాడారు. సంతాపసభ ప్రారంభానికి ముందు వసంతరావు చిత్రపటానికి నివాళులర్పించారు. పట్టణ కార్యదర్శి రావుల రాజబాబు అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఆ పార్టీ ఏపీ రాష్ట్ర నాయకులు మిరియం వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు తాతా భాస్కరరావు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కూకలకుంట రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ అధ్యక్షులు గాదె నరసింహారెడ్డి, భద్రాద్రి జిల్లా నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, టీడీపీ నాయకులు తాళ్లూరు జీవన్, జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాసరావు, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, దమ్మపేట మండల కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.