Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి గ్రామీణ రైతాంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్త సర్వే
- రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక కేటాయింపులు జరగాలి
- రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో.. :
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి టి.సాగర్
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై అనుసరిస్తున్న విధానం రైతాంగాన్ని తీవ్రంగా కలచి వేస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసం నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వేలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారామ ఫంక్షన్హాల్లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలు ఆదివారం కొనసాగాయి. 'వ్యవసాయరంగం-వాటి సవాళ్లు' అంశంపై జరిగిన సదస్సులో సాగర్లో పాల్గొని మాట్లాడారు. భవిష్యత్లో వ్యవసాయ రంగం ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రభుత్వాలకు నిర్ణయాత్మకమైన సర్వేలను అందించనున్నట్టు వెల్లడించారు. అందుకోసం ఈనెల 7 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై సర్వేలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల అవసరాలకు అనుగుణంగా రైతులు పంటలు వేయలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాల వల్లనూ పీకల్లోతు కష్టాల్లోకి రైతులు నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ రైతుల భవిష్యత్ ఆధారంగా ఉండాలని సూచించారు. బడ్జెట్లో రాష్ట్రంలో నెలకొన్న ప్రాజెక్టులు, రైతుల రుణాలు, రైతుబంధు, రైతుబీమాలను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ కేటాయింపులు జరగాలని సూచించారు. రైతు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర కల్పించేలా, అది అమలయ్యేలా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. పంటకు కనీస మద్దతు ధర చట్టం, ఋణ విమోచన చట్టం, కౌలు రైతు ఋణ అర్హత కార్డుల జారీ, ధరణిలో నెలకొన్న సమస్యల పరిష్కారం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వ ప్రాధాన్యత, ప్రకృతి వైపరీత్యాల వల్ల పూర్తిగా నష్టపోయిన పంటకి ఆర్థిక చెల్లింపులు.. తదితర సమస్యలపై తీర్మానాలు ఆమోదించారు. సమావేశంలో అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు పి.జంగారెడ్డి, ఉపాధ్యక్షులు మూడ్ శోభన్, మాదినేని రమేశ్, బండ శ్రీశైలం, నక్కల యాదవరెడ్డి, సహాయ కార్యదర్శులు కూన్రెడ్డి నాగిరెడ్డి, నున్నా నాగేశ్వరరావు, కున్సోత్ ధర్మా, కుమారస్వామి, బాల్రెడ్డి, ఎం.శ్రీనివాసులు, మంగ నర్సింహ, సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుర్రి శ్రీరాములు, దండ వెంకట్రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొప్పుల రజిత తదితరులు పాల్గొన్నారు.