Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 28, 29 సమ్మెను జయప్రదం చేయండి :
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్ రమ
- నయా ఉదారవాద విధానాలపై పోరాడాలని పిలుపు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
నిజామాబాద్ జిల్లాలోని ప్రతి పల్లె, బస్తీ, పరిశ్రమల్లో పనిచేసే ప్రతి కార్మికుడు ఈ నెల 28,29వ తేదీల్లో జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ సర్కారు మరింత దూకుడుగా అమలుచేస్తున్న నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం ఐక్యం కావాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆ సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని మోడీ సర్కారు వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రభుత్వ సంస్థల్లోని వాటాలను ప్రయివేటు, కార్పొరేట్ పెట్టుబడిదారులకు దారాధత్తం చేస్తోందని విమర్శించారు. రైల్వేల నుంచి మొదలు విమానయానం వరకు అన్నింటినీ ప్రయివేటీకరిస్తోందని విమర్శించారు. భవిష్యత్తులో ప్రజలు ప్రతి సేవనూ డబ్బులు పెట్టి కొనుక్కొనే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నష్టాల్లో ఉంటే ప్రభుత్వ సంస్థలను అమ్మేయడం, లాభాల్లో ఉంటే వాటాలను అమ్మడం పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. సింగరేణిలో నాలుగు బొగ్గు గనులను ప్రయివేటీకరించిందని అన్నారు. హైదరాబాద్లో కేంద్రీకృతమైన బీహెచ్ఎల్, హెచ్సీఎల్, బీడీఎల్ తదితర సంస్థల్లో 25-50 శాతం వాటాలు అమ్మిందని గుర్తు చేశారు. కార్మికులు, మధ్యతరగతి ప్రజలు అత్యధికులు పాలసీదార్లుగా ఉన్న ఎల్ఐసీలో లక్ష కోట్ల రూపాయల వాటాలు అమ్మేందుకు తెగబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లు ఎగ్గొట్టిన రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకుంటోందని అన్నారు. ఇక పెరిగిన నిత్యవసర ధరలను అదుపు చేయడం లేదని, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని విమర్శించారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున పెట్రోల్ చార్జీలు పెంచడం లేదని, ఎన్నికలు ముగియగానే మళ్లీ పెట్రో వడ్డన తప్పదని స్పష్టం చేశారు. పెరిగిన ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని కోరితే పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కారును ప్రజాపోరాటాలతోనే నిలువరించాలని స్పష్టం చేశారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమంతో ఎట్టకేలకు మూడు వ్యవసాయ నల్ల చట్టాలను సర్కారు విరమించుకున్నదని గుర్తు చేశారు. అదేవిధంగా కార్మికవర్గం ఐక్యంగా ఉద్యమించి మోడీ సర్కారు కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె రామ్మోహన్ రావు, నూర్జహాన్, ఉపాధ్యక్షులు రమేష్ బాబు, గోవర్ధన్, శంకర్ గౌడ్, ఈవీఎల్ నారాయణ, చక్రపాణి, అంగన్వాడీ జిల్లా కార్యదర్శి స్వర్ణ, రాజసులోచన, ఆశా యూనియన్ జిల్లా నాయకులు విజయ, రేణుక, మధ్యాహ్న భోజనం కార్మిక సంఘం నాయకులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.