Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
- ఇతర యూనియన్లకు ఆదర్శంగా శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ :
- సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
నవతెలంగాణ-పటాన్చెరు/ కంది
అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం మార్పులు చేస్తున్నదని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్.సాయిబాబు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) వార్షిక జనరల్ బాడీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి సాయిబాబు హాజరై మాట్లాడారు. 37 ఏండ్లుగా యూనియన్ను ఐక్యంగా నిలబెట్టుకుంటూ అనితరసాధ్యమైన విజయాలు సాధిస్తూ ముందుకు పోతున్నారని శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ను కొనియాడారు. కార్మిక వర్గ చైతన్యం కోసం, హక్కుల కొరకు జరిగే పోరాటాలు, పిలుపులు అమలులో అగ్రభాగాన ఉంటూ ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్నందుకు అభినందలు తెలిపారు. అలాగే ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మె ఎలాంటి సందర్భంలో ఎందుకు జరుగుతున్నదో కార్మికవర్గానికి తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్‌ను అమలుచేస్తే, మౌలిక వసతులపై ప్రభుత్వ నియంత్రణ కరువవుతుందని చెప్పారు. దాంతో రవాణా, ఆరోగ్యంతోపాటు అన్ని భారాలు ప్రజలపై తీవ్రస్థాయిలో పడతాయన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే మన పూర్వీకులు అనేక త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కరోనా లాక్డౌన్ సమయంలో కనీసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపకుండా యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్‌గా మార్చారని విమర్శించారు. కార్మికులకు నష్టం చేకూర్చే లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, కనీస పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలని, ప్రజల ఆస్తులను ప్రయివేటుకి ధారాదత్తం చేసే డీమోనిటైజేషన్ పైప్‌లైన్‌ను ఉపసంహరించాలని, ఇంకా అనేక డిమాండ్లపై జరిగే రెండురోజుల దేశవ్యాప్త సమ్మెలో కార్మికవర్గం జెండాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు, ఆఫీస్ బేరర్స్, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా విస్తృత స్థాయి సమావేశం..
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో ఆదివారం జరిగిన సీఐటీయూ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఎం.సాయిబాబు హాజరై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు రాష్ట్రంలోని అన్ని రంగాల కార్మికులను చైతన్యపరిచి సమ్మెకు సన్నద్ధం చేయాలని సూచించారు. కార్మికవర్గం సమ్మెలో పాల్గొనే విధంగా క్షేత్ర స్థాయి వరకు సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జాతీయత, దేశభక్తి గురించి కబుర్లు చెబుతూ ఆచరణలో మాత్రం విధ్వంసకర విధానాలను కేంద్రం అమలు చేస్తోందన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి. మల్లేశం, కోశాధికారి జి. సాయిలు, నాయకులు బాగారెడ్డి, రాజిరెడ్డి, వాజిద్ అలీ, యాదగిరి, మహిపాల్, సురేష్, ప్రసన్న, సుధాకర్ వివిధ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.