Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రజాసమస్యలపై చర్చ
- వ్యవసాయం, ఉపాధి కల్పనకు ప్రాధాన్యతనివ్వాలి
- నిజమైన సాగుదార్లకే 'రైతుబంధు' ఇవ్వాలి
- సంక్షేమ పథకాలకు కేటాయించే నిధులన్నీ ఖర్చు చేయాలి
- విద్యావైద్య రంగాలను ప్రభుత్వమే ఉచితంగా అందించాలి
- ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటించాలి
- నిరుద్యోగ భృతికి ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించాలి
నవతెలంగాణతో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
వ్యవసాయాభివృద్ధి, ఉపాధి కల్పనకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనివ్వాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. నిజమైన సాగుదార్లకే 'రైతుబంధు' ఇవ్వాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రజాసమస్యలపై చర్చ జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ చట్టసభల్లో ఇచ్చిన హామీల అమలు కోసం సమాజంలో చైతన్యం రావాలనీ, ప్రభుత్వంపై ఒత్తిడి పెరగాలని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కేటాయించే నిధుల్లో 60 శాతం వరకే ఖర్చు చేస్తున్నదన్నారు. ఆ పథకాలకు కేటాయించే నిధులన్నింటినీ ఖర్చు చేస్తే ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు. విద్యావైద్య రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలనీ, ఉచితంగా ప్రజలకు సేవలందించాలని సూచించారు. వివిధ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతికి ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి అమలు చేయాలని కోరారు. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
బడ్జెట్లో ప్రభుత్వం ఏయే రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నది. ఏయే రంగాలను విస్మరిస్తున్నది?
తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతా రంగాలకే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నది. ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నామని చెప్తున్నది. కానీ బడ్జెట్ అంకెలు, ఖర్చును పరిశీలిస్తే అది పూర్తిగా వాస్తవం కాదని తెలుస్తున్నది. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, ప్రాంతీయ పరిస్థితులను గమనించి బడ్జెట్ కేటాయింపులుండాలి. నీటిపారుదల రంగం తీసుకుంటే కాళేశ్వరానికి అధిక ప్రాధాన్యతనిచ్చి, ఎస్ఎల్బీసీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులకు మొండిచేయి చూపిస్తున్నది. ఇది సరైంది కాదు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం నూటికి 70 శాతం మంది పేదరికంటో ఉన్నారు. సంక్షేమ పథకాలకు కేటాయించే ప్రతి రూపాయి ఖర్చు చేస్తేనే బీపీఎల్ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయి. కానీ సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధుల్లో 60 శాతానికి మించి ఖర్చు చేయడంలేదు. ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయని సందర్భం ఉన్నది. విద్యావైద్య రంగాలు ముఖ్యమైనా వాటికి కేటాయింపులు ఏటా తగ్గుతున్నాయి. కరోనా నేపథ్యంలో వైద్యానికి తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు బడ్జెట్ కేటాయించి ఖర్చు చేస్తున్నది.
శాసనమండలిలో ప్రజా సమస్యలపై చర్చ జరుగుతున్నదా?
అవకాశం లేదు. ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదు. పాలకపార్టీ సభ్యులు ఎక్కువ మంది ఉండడం వల్ల సభ్యుల దామాషా ప్రకారం సమయం కేటాయిస్తారు. దీంతో ప్రభుత్వ విధానాలనే వల్లె వేయడం జరుగుతున్నది. అసెంబ్లీ, మండలి ఏకపార్టీతో నిండిఉంటే ఎలా ఉంటుందో తెలుస్తున్నది. ప్రతిపక్షం బలంగా ఉన్నపుడే ప్రజా సమస్యలు చర్చకు వస్తాయి. వామపక్ష సభ్యులు తగుసంఖ్యలో ఉంటే నిజమైన ప్రజాసమస్యలు చర్చించడంతోపాటు పరిష్కరించబడతాయి.
విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నదా? మండలి చైర్మెన్ సమయం ఇస్తున్నారా?
సభ్యుల సంఖ్యను బట్టి సమయం ఉంటుంది. మాట్లాడే సభ్యునికీ బలం వస్తుంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలన్నా, స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలన్నా సభ్యుల సంఖ్య తగు మోతాదులో ఉండాలి. అలా లేకుంటే ఇప్పుడు జరుగుతున్నదే ప్రతిబింబిస్తుంది. పాలనలో ఉన్నవారు ప్రజాస్వామ్యయుతంగా ఉండాలనుకుంటే సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతిపక్ష సభ్యులకు సమయమిస్తే సమస్యలు ఎక్కువగా చర్చించబడతాయి. ఈ వ్యవస్థలో ఇది ఆశించడం అత్యాశే అవుతుంది.
చట్టసభల సాక్షిగా సీఎం అనేక హామీలిస్తున్నారు. వాటి అమలుపై ఏమంటారు?
చట్టసభల్లో సీఎం ఇచ్చిన హామీలు అమలు జరగడం లేదని ప్రజలు గుర్తిస్తున్నారు, దాన్ని పాలకపక్షం గుర్తిస్తే తప్పనిసరిగా అమలు చేస్తారు. కానీ సభలోనైనా, ఎన్నికల్లోనైనా హామీ ఇస్తే ప్రజలు పట్టించుకోరన్న భావన ఉన్నది. మళ్లీ ఎన్నికలొచ్చినపుడు కొత్త హామీలిచ్చి గెలవొచ్చనే అభిప్రాయంతోనే వ్యవహరిస్తున్నారు. సమాజంలో ప్రజలు చైతన్యం కావాలి.
బడ్జెట్లో ఏయే రంగాలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది?
రాష్ట్రంలో ఇప్పటికీ ఎక్కువ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రైతుబంధు పథకానికి కేటాయించే డబ్బులను నిజమైన సాగుదార్లకు చెల్లించే పద్ధతి ఉంటే ఉపాధి పెరగడంతోపాటు చాలా కుటుంబాల ఆదాయం పెరుగుతుంది. పారిశ్రామిక విధానంలోనూ ఎన్ని కోట్లతో పరిశ్రమ పెడుతున్నారనేది చెప్తున్నారు తప్ప అందులో యువతకు ఎన్ని ఉద్యోగాలొస్తున్నాయనేది స్పష్టత లేదు. పారిశ్రామికీకరణ, ఉపాధి జంటగా అభివృద్ధి కావాలి. సంక్షేమ పథకాలకు కేటాయించే డబ్బును పూర్తిగా ఖర్చు చేయాలి. విద్యావైద్య రంగాలకు నిధుల కేటాయింపు పెంచాలి. ప్రభుత్వమే విద్యావైద్యాన్ని ఉచితంగా అందించాలి. అప్పుడే మానవాభివృద్ధి సూచిలో మన రాష్ట్ర ప్రజల పరిస్థితి పైస్థాయిలో ఉంటుంది.
మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిధుల సంగతి ఏంటీ?
2021-22 ఆర్థిక సంవత్సరంలోనే మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని 9,123 స్కూళ్లలో రూ.3,487,62 కోట్లతో 12 అంశాల్లో అభివృద్ధి చేస్తామని గతనెల మూడో తేదీన జీవో నాలుగు జారీ చేసింది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నిస్తే ఆర్నెల్ల కాలంలో మొదటిదశ కార్యక్రమం పూర్తి చేయొచ్చు. ప్రభుత్వం అనుకుంటే కాంట్రాక్టర్ల జేబుల్లోకి డబ్బులు పోతాయి. సరైన రీతిలో ఖర్చు చేస్తే 9,123 స్కూళ్లు అభివృద్ధి అవుతాయి. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలను పరిశీలిస్తే తనిఖీలు, నిరంతర పర్యవేక్షణ ఉన్నది. దీంతో కాంట్రాక్టర్ల జేబుల్లోకి నిధులు వెళ్లే అవకాశం లేదని భావిస్తున్నా. రూ.30 లక్షల వరకు పనులను ఎస్‌ఎంసీల పర్యవేక్షణలో ఉన్నందున కాంట్రాక్టర్ల ప్రమేయం తక్కువుంటుంది. అయినా ఓ కన్నేసి ఉంచాలి.
సర్కారు బడుల్లో 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాలని ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆశలు నెరవేరినట్టేనా?
రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 75 శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ఫీజులు చెల్లించడం కష్టమైన వాళ్లు, వారి నివాస ప్రాంతాల్లోని సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం లేనందున ప్రయివేటు పాఠశాలలకు పిల్లలను పంపిస్తున్నారు. తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గే అవకాశముంటుంది. వారి కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నామనే తృప్తి కలుగుతుంది.
వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నాయి? నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటీ?
2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో లోకల్ క్యాడర్, జోనల్ క్యాడర్, మల్టీ జోనల్ క్యాడర్లో మార్పు జరిగింది. దాని ప్రకారం ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపు పూర్తయ్యింది. ఇప్పుడు ఖాళీ పోస్టులన్నింటికీ నోటిఫికేషన్లను జారీ చేసి నియామక ప్రక్రియ ప్రారంభించొచ్చు. ఇంకా ఆలస్యం చేస్తే నిరుద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అవసరమైతే ఉద్యమాల బాట పట్టాలి. అందుకు నేను ఎల్లవేళలా సహాయసహకారాలు అందిస్తాను. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి నిరుద్యోగ భృతిని అమలు చేయాలి.