Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ కంటే చత్తీస్‌ఘడ్‌లో మంచి పథకాలు
- బీజేపీకి వ్యతిరేమని చెప్పేందుకే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంది
- కేసీఆర్ సర్కారుకు ఇది చివరి బడ్జెట్ : సీఎల్పీ విస్తృత సమావేశంలో రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలోనే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ ఉంటుందంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కంటే చత్తీస్గడ్ మంచి పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. దీనిపై మంత్రి కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాని మోడీ, బీజేపీకి వ్యతిరేమని చెప్పేందుకే శాసనసభలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అనీ, డిసెంబర్లో ముందస్తు ఎన్నికలకు పోతారని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో హోటల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, అనుబంధసంఘాల చైర్మెన్లతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ గతంలో ఫామ్ హౌస్, డ్రగ్స్ విషయంలో తనకు సవాల్ విసిరారనీ, తాను సిద్ధమనగానే ఆయన పారిపోయారని చెప్పారు. తెలంగాణ కంటే చత్తీస్‌గఢ్‌లో మంచి పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. వరి క్వింటాలుకు రూ 1960 మద్దతు ధర ఉంటే చత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ 2,500 ఇస్తున్నారు. తెలంగాణలో వరి కుప్పలపై గుండె పగిలి చనిపోతున్నారని చెప్పారు. వరి వేస్తే ఉరి అంటూ పాలకులు చెబుతున్నారనీ, ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం లేదని విమర్శించారు. చత్తీస్‌గఢ్‌లో ప్రతి ఎకరాకు పదివేలు ఇస్తున్నదని తెలిపారు. ఈ విషయాలను నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టబోయే చివరి బడ్జెట్ అనీ, డిసెంబర్లో అసెంబ్లీ రద్దవుతున్నదన్నారు. గవర్నర్ ప్రసంగం జరిగితే, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే అవకాశం ఉండేదన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ద్వారా మోడీకి వ్యతిరేకమని చెప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు 55రోజులు జరిగేవన్నారు. బడ్జెట్ సమావేశాలు 30 రోజులు జరిగేవన్నారు. కానీ ఇప్పుడు ఎనిమిది రోజులకు కుదించారని విమర్శించారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు కనీసం 21 రోజులు జరిగేలా కాంగ్రెస్ పోరాటం చేయాలని కోరారు. సభలో అధికారపక్షం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏమాత్రం అవమానం చేసినా.. రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు దిగుతాయని హెచ్చరించారు. ఎక్కడికక్కడ టీఆర్ఎస్ను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సభలో అవకాశం రాకపోతే, వీధుల్లో పోరాడుదామని చెప్పారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కడమే: భట్టి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రభుత్వం తూ తూ మంత్రంగా బడ్జెట్ సమావేశాలు జరపాలని చూస్తున్నదని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమైందనీ, సభ ప్రొరోగ్ జరగలేదని చెప్పడం... సాంప్రదాయానికి విరుద్ధమన్నారు. ఇన్ని రోజులు ప్రొరోగ్ చేయలేదంటేనే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. గవర్నర్‌కు ధన్యవాదాలు చెప్పే సందర్భంగా ప్రభుత్వ విధానాలను ఎండగట్టే అవకాశం కోల్పోయామని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను బలిచేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఈ సమావేశాలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గైర్హజరయ్యారు. రేవంత్‌రెడ్డి మెదక్ పర్యటనకు తనకు సమాచారమివ్వలేదంటూ సీఎల్పీ విస్తృత సమావేశాన్ని ఎమ్మెల్యే జగ్గారెడ్డి బహిష్కరించారు. ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.