Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి హరీశ్‌రావు
- హైదరాబాద్ వేదికగానే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక
- జార్ఖండ్, ఢిల్లీ పర్యటనలు వివరించిన సీఎం కేసీఆర్
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సోమవారం నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. 2022-23 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత బడ్జెట్లో ప్రాధాన్యతా రంగాల వారీగా ఏ శాఖకు ఎంత కేటాయించిందీ మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ఆదాయం, ఖర్చులు, గతేడాది వ్యయాలు, తదితరాలను ఆర్ధిక మంత్రి హరీశ్ రావు కేబినేట్ దృష్టికి తీసుకొచ్చారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేవారికి రూ.5లక్షలు ఆర్ధిక సహాయం చేస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ బడ్జెట్లో ఆ పథకానికి నిధులు కేటాయించినట్టు తెలిసింది. నిరుద్యోగ భృతికి ఈసారి కూడా నిధులు కేటాయించలేదని సమాచారం. అసెంబ్లీలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపై కూడా సీఎం కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఝార్ఖండ్, ఢిల్లీ పర్యటనల వివరాలను వివరించినట్టు తెలిసింది. బీజేపీి, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామనీ, దేశంలోని ప్రాంతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోందని ఆయన వివరించినట్టు సమాచారం. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఆవిర్భావానికి హైదరాబాద్ కేంద్రంగా నిలవబోతోందని ఆయన చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చిస్తున్నానని, త్వరలోనే అందరితో కలిసి సమావేశం నిర్వహించి ప్రత్యామ్నాయ వేదికను ప్రకటించేందుకు కృషి జరుగుతోందని సీఎం కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో రాజ్‌భవన్ లీకులు, బీజేపీ విమర్శలపై పెద్దగా స్పందించాల్సిన అవసరంలేదని ఆయన మంత్రివర్గ సహచరులకు సూచించినట్టు సమాచారం. అసెంబ్లీని సమావేశపర్చడం నిబంధనల మేరకే జరుగుతుందని వివరణ ఇచ్చినట్టు తెలిసింది.