Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆర్టీసీ జేఏసీ వినతిపత్రాలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆర్టీసీ పరిరక్షణ కోసం రాష్ట్ర బడ్జెట్లో రెండు శాతం నిధులు కేటాయించాలనీ, ఈ మేరకు
ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ టీఎస్ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రతిపక్షపార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు సమర్పించారు. జేఏసీ చైర్మన్ కే రాజిరెడ్డి, వైస్ చైర్మన్ కే హన్మంతు ముదిరాజ్, కో కన్వీనర్ అబ్రహం, జేఏసీ సభ్యులు స్వాములయ్య, గంగాధర్ తదితరులు ప్రజాప్రతినిధులను కలిసిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకులు మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పీసీపీ అధ్యక్షులు ఏ రేవంత్రెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎంఐంఎ శాసనసబాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందనరావు తదితరులను కలిసి ఆర్టీసీ స్థితి గతులు, ఆర్థిక ఆవసరాలు, ప్రభుత్వ సహకారం తదితర అంశాలతో కూడిన వినతిపత్రాలను సమర్పించారు. ఆర్టీసీని పరిరక్షించడంలో భాగస్వాములు కావాలనీ, అసెంబ్లీలో దీనిపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న డీజిల్భారాలతో సంస్థకు వస్తున్న నష్టాలు, కార్మికులకు ఇవ్వాల్సిన రెండు ఫిట్మెంట్లు, ఆరు డిఏ బకాయిలు, రిటైర్డ్ కార్మికుల కష్టాలు, అక్రమ రవాణా, కార్గో విస్తరణ సహా అనేక అంశాలను వారు ప్రస్తావించారు. సంస్థలో ఖర్చు తగ్గించేందుకు ప్రస్తుతం ఉన్న ఐదంచెల వ్యవస్థను మూడంచెలకు కుదించాలనీ, జోనల్, డివిజనల్ వ్యవస్థల్ని రద్దు చేయాలని సూచించారు. జేఏసీ నేతల వినతిపత్రాలపై ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. అసెంబ్లీలో జేఏసీ పేర్కొన్న అంశాలను తప్పకుండా ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు.