Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్ఏలు తెలంగాణ బిడ్డలుకారా? పేస్కేలు అమలు చేయరా?
- వారికిచ్చే నెల జీతం.. మంత్రుల గంట ఖర్చు
- పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలిచ్చేదాకా పోరాటం : జూలకంటి
- ఈ నెల 9 నుంచి నిరసన దీక్షలు : వంగూరు రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ పెద్ద దొర.. కేసీఆర్ చిన్నదొర.. వారిద్దరూ ప్రజలను మోసం చేస్తూ అప్పుల మీద అప్పులు చేస్తూ భారాలను మోపుతున్నా రనీ, వారిద్దరినీ ప్రతి పౌరుడూ ప్రశ్నించాలని వీఆర్ఏల సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపుని చ్చారు. వీఆర్ఏలు తెలంగాణ బిడ్డలు కారా? మనుషులు కారా? ఎందుకు పర్మినెంట్ చేయరు? అని ప్రశ్నించారు. వారికిచ్చే నెల జీతం మంత్రుల గంట ఖర్చు కాదని తెలిపారు. వీఆర్ఏలకు పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చే దాకా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీఆర్ఏల సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీఆర్ఏలకు జీతాలు పెరగడంలో, సమస్యలను పరిష్కంచడంలో పాలకుల మెడలు వంచి విజయం సాధించడంలో నర్రారాఘవరెడ్డి కృషి మరువలేనిదన్నారు. క్షేత్రస్థాయిలో సమాచారణ సేకరణ, పథకాల అమలులో వీఆర్ఏలది కీలక పాత్ర అన్నారు. తక్కువ జీతమిస్తూ వారితో గొడ్డుచాకిరీ చేయిస్తున్న పరిస్థితి నేడు నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి కంటే ఎక్కువ పనిగంటలు పనిచేసేవాళ్లు పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటే తక్కువ పనిచేసేవాళ్లు భోగభాగ్యాలు అనుభవిస్తున్నారని చెప్పారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ అనుకూల నిర్ణయాలే కారణమని వివరించారు. విచ్చలవిడిగా అప్పులు చేయడం, ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం, విలువైన ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టడం, మతంపేర ప్రజలను చీల్చడమనే నాలుగు లక్ష్యాలతో మోడీ సర్కారు ముందుకు పోతున్నదని విమర్శించారు. 2014కు ముందు మన దేశ అప్పు రూ.50 లక్షల కోట్లు ఉంటే మోడీ వచ్చాక రూ.1.35 లక్షల కోట్లకు చేరుకున్నదని వివరించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నల్లడబ్బు వెలికితీసి పేదల ఖాతాల్లో జమచేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజాస్వామ్యయుత పాలనకు పాతరేసి నిరంకుశత్వంతో ముందుకెళ్తున్నారని విమర్శించారు. గతంలో ప్రజా సమస్యలపై వారానికో రెండు,మూడు సార్లు సీఎంను కలిసే అవకాశం ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల నేతలకు ఉండేదనీ, కేసీఆర్ సీఎం అయ్యాక అపాయింట్మెంట్లే కరువయ్యాయని తెలిపారు. పాలకులు గుర్తించకపోయినా ప్రజల్లోకి తమ సమస్యలను తీసుకెళ్లేలా వీఆర్ఏలు తమ హక్కుల కోసం పోరాడాలనీ, పాలకుల లోపాలను ఎత్తిచూపాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన పోరాడే ఎర్రజెండా వీఆర్ఏలకు ఎప్పుడూ అండగా ఉంటుందని హామీనిచ్చారు. వీఆర్ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు మాట్లాడుతూ..ఈ బడ్జెట్లోనే వీఆర్ఏలను పర్మినెంట్ చేస్తూ నిధులు కేటాయించాలనీ, పేస్కేలు అమలు చేస్తూ వెంటనే జీవో విడుదల చేయాలనీ, వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన దీక్షలు చేపడతామని ప్రకటించారు. తామేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదనీ, వీఆర్ఏలకు పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 774 జీవో తీసుకొచ్చిన సందర్భంలో వీఆర్ఏలు చేసిన పోరాటం చంద్రబాబు ప్రభుత్వం దిగిపోవడానికి ఒక కారణమైందనీ, నేడు కేసీఆర్ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ..వీఆర్ఏల పోరాటం న్యాయసమ్మతమైనదన్నారు. వారికి అండగా సీఐటీయూ ఉంటుందని హామీనిచ్చారు. ఐక్యపోరాటాలతో పాలకులపై కొట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయని నొక్కిచెప్పారు. వీఆర్ఏల సంఘం వ్యవస్థాపకులు మోసంగి అంజయ్య, వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలనర్సయ్య, ఎల్.నర్సింహ్మ, ఎస్కే దాదేమియా, అమీరుద్దీన్, సీహెచ్ రాజయ్య, బాలరాజు, రమేశ్, ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, వీఆర్ఏలు పాల్గొన్నారు.