Authorization
Sat March 22, 2025 11:25:49 am
- ఆర్అండ్బీకి అత్తెసరు నిధులు..
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్ 2022-23లో రోడ్లు, భవనాల శాఖకు నిధుల కేటాయింపును పరిశీలిస్తే అంకెలు ఘనంగా ఉన్నాయి. గతం కంటే ఎక్కువ నిధులు ఇచ్చినట్టు లెక్కటు చెబుతున్నాయి. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం రూ. 17,599 కోట్లు కేటాయింపులు చేసింది. నిర్వహణ పద్దు కింద రూ. 3888.52 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 13,710.58 కోట్లు చూపించింది. గతేడాది బడ్జెట్ కంటే ఈ సారి రూ. 4,845 కోట్లు అధికంగా ప్రతిపాదించింది. అయితే, గత 2021-22 బడ్జెట్లో మాత్రం రూ. 12,688.27 కోట్లు కేటాయించి, సవరించిన అంచనాల్లో కేవలం రూ. 8773.26 కోట్లనే ఖర్చు చేసింది. మిగతా రూ. 3,915 కోట్ల నిధులు మురిగిపోయాయి. భారీ నిధులు కేటాయిస్తున్నట్టు కనిపిస్తున్నా, ఖర్చులోకి వచ్చేసరికి నిధులు పెండింగ్లో ఉంటున్నాయి.
సచివాలయం, కలెక్టరేట్లకు రూ. 1000 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు బడ్జెట్లో కేటాయింపుల వివరాలను పరిశీలిస్తే కొత్త సచివాలయం కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 కోట్లు ప్రతిపాదించింది. అయితే, గత సంవత్సర బడ్జెట్లో ఇందుకోసం రూ. 600 కోట్లు చూపించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు, కొత్త జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్న నూతన సమీకత కలెక్టరేట్ భవనాల నిర్మాణానికి రూ. 400 కోట్లు ఇవ్వగా, గతంలో వీటికే రూ. 500 కోట్లు కేటాయించి ఖర్చు చేశారు. ఇక తెలంగాణ కళాభారతి నిర్మాణానికి రూ. 100 కోట్లు ప్రతిపాదించారు. రైల్వే ట్రాక్ల వద్ద బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 400 కోట్లు, హైదరాబాద్లో ఎమ్మెల్యేలకు బహుళ అంతస్థుల భవనాల నిర్మాణానికి రూ. 45 కోట్లు, సీఆర్ఎఫ్ నిధుల కింద రూ. 301 కోట్లు ఇచ్చారు. రిజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ తదితర పనులకు రూ. 500 కోట్లు కేటాయింపులు చేయగా, గతంలో రూ. 750 కోట్లు ఖర్చు చేసినట్టు బడ్జెట్ లెక్కలు చెబుతున్నాయి. ఇక రోడ్లు, వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం ప్రస్తుతం బడ్జెట్లో రూ. 2001 కోట్లు కేటాయించింది. గతం కంటే ప్రభుత్వం కేవలం రూ.1 కోటి మాత్రమే అధికంగా ఇచ్చింది. 2021-22 బడ్జెట్లో రూ. 2000 కోట్లు కేటాయిస్తే, సవరించిన అంచనాల ఆధారంగా పరిశీలిస్తే కేవలం రూ. 500 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు రుజువవుతున్నది. అయితే, ఈ సారి రూ.2001 కోట్లు కేటాయించిన నేపథ్యంలో వీటిని కూడా ఏ మేరకు ఖర్చు చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ. 495 కోట్లను ప్రతిపాదించింది. అందులో రూ. 198 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుండగా, రూ. 297 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు.