Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కేసులో నిందితుల వాంగ్మూలం ఆధారంగా విచారణకు హాజరుకావాలని బీజేపీ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పీఏ జితేంద్రరాజును పేట్‌బషీరాబాద్ పోలీసులు నోటీసు ఇవ్వడాన్ని సవాల్ చేసిన కేసును హైకోర్టు సోమవారం విచారించింది. ఈనెల 11న తదుపరి విచారణ చేస్తామనీ, అప్పటి వరకు జితేంద్రరాజుపై కఠిన చర్యలు చేపట్టొద్దని పోలీసుల్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ ఆదేశించారు. ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే ఇవ్వలేదనీ, స్వల్ప వ్యవథి గడువు ఇచ్చి విచారణకు రమ్మంటున్నారని పిటిషనర్ న్యాయవాది చెప్పారు.
వితంతువులపై వివక్ష తగదు
కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపుల్లో వితంతువుల విషయంలో వివక్ష సరికాదని హైకోర్టు పేర్కొంది. చేవెళ్లలో టీచర్‌గా చేసే మమతను రంగారెడ్డి జిల్లాకు బదులుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు కేటాయింపు చేశారు. దీనిని ఆమె సవాల్ చేసిన రిట్‌ను సోమవారం చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది. ఉద్యోగంలో చేరినప్పుడు వితంతువుగా ఉన్న వాళ్లకు 317 జీవో ప్రకారం మినహాయింపు ఇవ్వలేదనీ, కారుణ్య నియామకంలోని వితంతువులకు మాత్రమే మినహాయింపు ఇవ్వడం అన్యాయమని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఆ జీవో ప్రకారం కారుణ్య నియామక వితంతువులకు మినహాయింపులు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. ఆమె ఇచ్చిన వినతిపత్రంపై చర్యలు తీసుకుని నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
కేంద్రం ఆమోదం చెప్పేలా ఉత్తర్వులు ఇవ్వాలి
ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిని తెలంగాణ రాష్ట్ర విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఇచ్చిన ఆదేశాల అమలుకు వీలుగా అనుమతి ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు.
క్యాట్ ఆదేశాలు అమలులో జాప్యంపై మహంతి కోర్టు ధిక్కార కేసు వేశారనీ, దీని విచారణకు ఈనెల 11న స్వయంగా హాజరు కావాలని క్యాట్ ఆదేశించిందని తెలిపారు. కేంద్రం 11వ తేదీలోగా స్పందించేలా ఉత్తర్వులివ్వాలని లేకపోతే క్యాట్‌కు తగిన ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై మహంతి కౌంటర్ పిటిషన్లో స్పందిస్తూ, సోమేష్‌కుమార్ సహా ఎంతో మంది క్యాట్ ఆదేశాలతోనే తెలంగాణలో కొనసాగుతున్నారనీ, వాళ్లకు రాయని లేఖ తన విషయంలో కేంద్రానికి రాష్ట్రం లెటర్ రాయడంలో ఆంతర్యం ఏమిటో తేల్చాలన్నారు. క్యాట్ ఆదేశాల్ని అమలు చేయకుండా ఉండేందుకే రిట్ వేశారనీ, దీనిని కొట్టేయాలని కోరారు.