Authorization
Sat March 22, 2025 09:55:09 am
- వ్యవసాయ, అనుబంధ రంగాల్లో గణనీయ ప్రగతి
- సామాజిక ఆర్ధిక నివేదిక 2020లో ప్రభుత్వం వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా కష్టకాలంలో అవరోధాలను సైతం అధిగమించి తెలంగాణ రాష్ట్రం గత ఆర్ధిక సంవత్సరం 2.2 శాతం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి సాధించిందని ప్రభుత్వం పేర్కొంది. 2020 సంవత్సరానికి సంబంధించి ప్రణాళిక శాఖ రూపొందించిన తెలంగాణ సామాజిక ఆర్ధిక నివేదికను ప్రభుత్వం సోమవారం శాసనసభకు సమర్పించింది. తలసరి ఆదాయం 2.79 లక్షలకు చేరిందని వివరించింది. ఆయా రంగాల వారీగా వృద్ధిని అందులో పొందుపర్చారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా వ్యవసాయ, అనుబంధ రంగాలు గణనీయ వృద్ధి సాధించాయనీ, రైతుబంధు, మిషన్ కాకతీయ పథకాలు రైతులకు ఇతోధికంగా ఉపయోగపడుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. గత ఎనిమిది సీజన్లలో 63లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.50,448 కోట్ల నగదు జమచేసినట్టు పేర్కొంది. 242.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 39.5 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో పశుసంపద కూడా 22శాతం పెరిగినట్టు చూపెట్టింది. 20లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ప్రకటించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో 20.23శాతం, సేవా రంగాల్లో 18.32 శాతం వృద్ధి జరిగినట్టు తెలిపింది. ఐటీ ఎగుమతులు రూ. 66,276 కోట్ల నుంచి రూ.1,25,522 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఆ రంగంలో ఉపాధి పొందుతున్నవారు 3.71లక్షల నుంచి 6.28లక్షలకు పెరిగారనీ, ఉపాధి అవకాశాలు పెరిగాయని చూపెట్టింది. టీఎస్ఐపాస్ ద్వారా 3,185 అనుమతులివ్వగా రూ.6,965 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వివరించింది. సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో కూడా తెలంగాణ ముందు వరుసలో ఉందని పేర్కొంది. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు కేసీఆర్ కిట్ వంటి పథకాల కారణంగా ఆస్పత్రుల్లో ప్రసవాలు 91.5శాతం నుంచి 97శాతానికి పెరిగాయని, శిశు మరణాలు కూడా తగ్గాయని వెల్లడించింది. గత రెండేండ్లలో 3.6లక్షల కేసీఆర్ కిట్లను లబ్దిదారులకు అందించినట్టు తెలిపింది. వచ్చే మూడేండ్లలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.7289 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. దళిత బంధు పథకం కింద ఈ జనవరి వరకు ప్రభుత్వం రూ.2007కోట్లు విడుదల చేసింది. గతేడాది స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ప్రభుత్వం రూ.10వేల కోట్ల రుణాలు జమచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.91లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించాలని నిర్ణయించగా ఇప్పటివరకు 1.08లక్షల ఇళ్లు పూర్తిచేసి లబ్దిదారులకు పంపిణీ చేసినట్టు నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా, గ్రామపంచాయతీలకు ప్రతినెలా నిధులు విడుదల చేస్తుండటంతో గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని వివరించింది.