Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు సంతృప్తికరంగా లేవనీ, మరిన్ని నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎన్యూటీఎఫ్) అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి కోరారు. 2022-2023 బడ్జెట్లో రూ 2,56,958 కోట్లకుగాను విద్యకు కేవలం రూ.16085 కోట్లు కేటాయించడం సమంజసంగా లేదని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాదితో పోల్చితే కేవలం రూ.2,470 కోట్లు అదనంగా కేటాయించినట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. అయితే ఇందులో వాస్తవానికి ఎంత ఖర్చు చేస్తారో అనుమానమేనని తెలిపారు. గత బడ్జెట్లో వినూత్న విద్యాపథకం పేరుతో ప్రకటించిన రెండు వేల కోట్లలో ఒక్క రూపాయి విడుదల చేయలేదని విమర్శించారు. ఈ బడ్జెట్లో 9,123 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.3,497 కోట్లతో మనఊరు- మనబడి పథకాన్ని ప్రకటించినప్పటికీ నిధుల కేటాయింపు కనపడటం లేదని పేర్కొన్నారు. బడ్జెట్లో కొఠారి కమిషన్ చెప్పినట్టు విద్యకు 30 శాతం కాకున్నా అందులో కనీసం మూడో వంతు అయినా ఈ బడ్జెట్లో కేటాయించాలని కోరారు.
అరకొర కేటాయింపులతో విద్యాసంక్షోభం : టీపీటీఎఫ్
బడ్జెట్లో అరకొర కేటాయింపులతో విద్యారంగంలో సంక్షోభం వస్తుందని టీపీటీఎఫ్ అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏడేండ్లుగా బడ్జెట్ పరిమాణం పెరిగిన దామాషాలు విద్యారంగానికి నిధుల కేటాయింపు పెరగడం లేదని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం తరహాలో విద్యకు 25 శాతం నిధులు కేటాయించాలని కోరారు.
విద్యారంగానికి కేటాయింపులు నిరాశాజనకం : డీటీఎఫ్
బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు నిరాశాజనకంగా ఉన్నాయని డీటీఎఫ్ అధ్యక్షులు ఎం రఘుశంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి తెలిపారు. బడ్జెట్లో విద్యకు 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలనీ, విద్యలో పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.