Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హక్కుల్ని కాలరాస్తూ సస్పెండ్ : రాజాసింగ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం తాము అసెంబ్లీలో ఉన్నామనీ, అందుకు భిన్నంగా హక్కుల్ని కాలరాస్తూ బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దారుణమని బీజేపీ ఎల్పీ నేత రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం రాజకీయ కుట్రలో భాగమేనని విమర్శించారు. అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తమ హక్కులను హరించే హక్కు సీఎం కేసీఆర్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలమని కూడా చూడకుండా పోలీసులు అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. తమ హక్కుల్ని కాపాడాల్సిన స్పీకర్ కూడా స్పందించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సభా సంప్రదాయల్ని తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. పోలీసుల సెక్యూరిటీ మధ్య కేసీఆర్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారనీ, చివరకు అసెంబ్లీని కూడా పోలీసుల బందోబస్తు మధ్యనే నడుపుతున్నారని విమర్శించారు. తెలంగాణాలో కల్వకుంట్ల రాజ్యాంగం నడవనీయబోమనీ, నయా నిజాం రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని హెచ్చరించారు.