Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారీ బడ్జెట్లో కార్మికవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపిందనీ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పూర్తిగా విస్మరించిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ విమర్శించారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేదని పేర్కొన్నారు. ప్రజారవాణ రంగ సంస్థ అయిన ఆర్టీసీకి నామమాత్రపు నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. ఈ మేరకు వారు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 73 షెడ్యూల్డ్ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న 1.20 కోట్ల మందికి సంబంధించిన కనీస వేతనాల పెంపు జీవోల ప్రస్తావన లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న హమాలీల సంక్షేమ బోర్డు, ఆటో రంగం కార్మికుల సంక్షేమ బోర్డుల గురించి మాట్లాడకపోవడం బాధాకరమని తెలిపారు. రాష్ట్రంలోని 2.50 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రస్తావనే లేదని విమర్శించారు.23 వేలకు పైగా ఉన్న వీఆర్ఏల పే-స్కేల్ హామీ మాట మరిచారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి కోతలు పెట్టిందని విమర్శిస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో 7,500 మందికి పైగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే విషయాన్ని విస్మరించడం శోచనీయమని పేర్కొన్నారు. అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు వివిధ రూపాలలో కాజేస్తున్న సర్కారు వారికి సబ్సిడీపై బైకులు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనాలను, బీడీ కార్మికుల పింఛన్‌ను పెంచలేదని విమర్శించారు. ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం కనీస వేతనాలు ప్రకటించకుండా బెడ్ల వారీగా ఛార్జీలు పెంచడం వల్ల కాంట్రాక్టర్లకే లాభమని పేర్కొన్నారు. మిషన్ భగీరథ, మధ్యాహ్న భోజనం తదితర కార్మికులకు వేతనాలు పెంచకపోవడం శోచనీయమని తెలిపారు. సింగరేణి రెగ్యులర్, కాంట్రాక్టు కార్మికులకు ప్రత్యేకంగా ఎటువంటి ప్రయోజనం కలిగే ప్రకటన చేయలేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి కార్మికవర్గానికి మేలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికవర్గానికి మేలు చేయని బడ్జెట్ పట్ల నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు.