Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలే ఇస్తామనటం మోసమే
- పట్టణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పనికి నిధుల కేటాయింపేదీ? : వ్యకాస
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''బొందిలో ప్రాణముండగా దళితుల మూడెకరాల సాగు భూమి పంపిణీ ఆగదు. ఎన్ని కోట్ల రూపాయలైనా పెట్టి కొనిస్తా'' అంటూ గతంలో హామీనిచ్చిన సీఎం కేసీఆర్ నేడు ఆ పథకానికి ఒక్క పైసా కేటాయించకుండా మంగళం పాడారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకట్రాములు విమర్శించారు. ఈ మేరకు వారు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటి స్థలముండి ఇండ్లులేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టుకోవడం కోసం రూ.5.50 లక్షలు ఇస్తామంటూ గత ఎన్నికల్లో హామీనిచ్చి ఇప్పుడు మూడు లక్షల రూపాయలే ఇస్తామని చెప్పడం ప్రజల్ని మోసం చేయడమేనని పేర్కొన్నారు. ఆ డబ్బులతో ఇల్లు ఎలా కట్టుకోవచ్చునో రాష్ట్ర సర్కారు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పట్టణాల్లో ఉపాధిహామీ పనులు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ లేఖ రాయడంతో పేదల్లో ఆశలు రేకెత్తాయని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా దానికి నిధులు కేటాయించకపోవడం దాని ద్వంద్వ విధానానికి నిదర్శనమని విమర్శించారు. కేరళ వామపక్ష ప్రభుత్వం తరహాలో పట్టణ పేదల కోసం ఉపాధి హామీ పనులు కోసం నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు 31,52,262 అప్లికేషన్లు మీ సేవల ద్వారా పేదలు పెట్టుకున్నారని చెప్పి గతేడాది కేటాయించిన రూ 11,728 లక్షలతోనే అదనపు పింఛన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మనిషికి ఆరు కేజీల బియ్యంతో ఆహార భద్రత కల్పిస్తున్నామని ఆర్ధికమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క తెల్లరేషన్ కార్డు కూడా ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యావసర సరుకుల పంపిణీ కోసం నిధులు కేటాయించాలనీ, దరఖాస్తు చేసుకున్న వారందరికీ తెల్లరేషన్ కార్డులివ్వాలని కోరారు. అభివృద్ధి కోసం భూసేకరణ జరుగుతున్న ప్రాంతాల్లో భూముల ఆధారంగా బతుకుతున్న వ్యవసాయ కూలీలు, వృత్తిదారులకు పునరావాస ప్యాకేజీ ఇవ్వడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవడం దారుణమని విమర్శించారు.