Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.250 కోట్లు చాలన్న హామీని మరిచిన సీఎం
- సమగ్ర భూ సర్వేకు రూ.150 కోట్లే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్ఏలకు పేస్కేలు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి ఈ బడ్జెట్లోనూ చోటు దక్కలేదు. 2020 సెప్టెంబర్లో వీఆర్వో వ్యవస్థ రద్దుపై అసెంబ్లీలో సీఎం మాట్లాడే సందర్భంలో 'వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినా...విపత్తులు, అత్యవసర సమాచారాలు అందించేందుకుగానూ ఊరికో వీఆర్ఏను అట్లాగే ఉంచుతాం. వారికి పేస్కేలు వర్తింపజేస్తాం. వాళ్లంతా దళితులు, ఇతర వెనుకబడిన సామాజిక తరగతుల వారే. కచ్చితంగా న్యాయం చేస్తాం. మినిమం పే స్కేల్ వర్తింపజేసేందుకు రూ.250 కోట్లు అయితే సరిపోతుంది' అని ప్రకటించారు. సీఎం హామీనిచ్చి 18 నెలలు దాటిపోయింది. సీఎం చెప్పిన సమయంలో వారికి జీవో విడుదల చేస్తే సర్వీస్ పరంగా ఎంతో న్యాయం జరిగేది. ఇటీవల పెరిగిన పీఆర్సీ కూడా వారి వేతనాలకు జమయ్యేది. ఫలితంగా వారి వేతనం రూ.26 వేల నుంచి రూ.27 వరకు చేరేది. కానీ, అది ఇప్పటిదాకా జరగలేదు. దీంతో కేవలం రూ.10,500 వేతనంతోనే బతుకులీడుస్తున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు కనీసం ముందుకు రానివ్వని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. సీఎం తరుచూ పిలిపించుకునే రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు చెప్పే మాటలను నమ్ముతూ పోయారు. విసిగివేసారిన వీఆర్ఏలంతా ఆందోళనబాట పట్టారు. అప్పుడూ సీఎం ఢిల్లీ పర్యటన నుంచి రాగానే వీఆర్ఏల పేస్కేలు ఫైలుపై సంతకం పెడతారుకదా..బడ్జెట్లో మీకు నిధులు కేటాయించబోతున్న సమయంలో ఎందుకీ ధర్నాలు, రాస్తారోకోలు అని వీఆర్ఏలను కొందరు రెవెన్యూ సంఘాల నేతలు మభ్యపెట్టారు. నిజమేకాబోలు అని వీఆర్ఏలలో చాలా మంది నమ్మేశారు. తీరా బడ్జెట్ చూస్తే వారి కోసం రూ.250 కోట్లు కాదు కదా నయా పైసా కేటాయించలేదు. వారసత్వ ఉద్యోగాల హామీ, సొంతూరులో డబుల్బెడ్రూమ్ ఇల్లు హామీ, ప్రమోషన్లు అంటూ ఆశల్లో విహరించిన వీఆర్ఏలకు చివరకు నిరాశనే ఈ బడ్జెట్ మిగిల్చింది. 'వీఆర్ఏలకు రాష్ట్ర సర్కారు తీవ్ర అన్యాయం చేసింది. దీనిపై పోరాటాలకు సిద్ధమవుతున్నాం. బుధవారం నుంచి తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన దీక్షలకు దిగుతాం. అవసరమైతే సమ్మెలోకి కూడా వెళ్తాం' అని వీఆర్ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు హెచ్చరించారు. వీఆర్వోల పంచాయతీ కూడా ఇంకా తెగలేదు.
డిజిటల్ సర్వేకు తగ్గిన నిధులు
భూ సమస్యలు, వివాదాలకు చెక్పెట్టేందుకు డిజిటల్ భూ సర్వేతో ఆక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూముల కొలతలు నిర్ధారించేందుకు రాష్ట్ర సర్కారు గతేడాది ఉపక్రమించింది. అందులో భాగంగా ప్రత్యేకంగా బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించింది. టెండర్లు, గ్రామాల ఎంపిక పేరుతో కొంత హడావిడి జరిగినా..ఆ తర్వాత అది పట్టాలెక్కింది. ఇప్పుడు ఏకంగా ఆ సర్వేకు బడ్జెట్లో నిధులను రాష్ట్ర సర్కారు తగ్గించేసింది. రూ.150 కోట్లు మాత్రమే కేటాయించి మమా అనిపించింది. దీంతో సర్వే అడుగులు పడతాయా? అన్నది సందేహమే.