Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఏటా విద్యారంగ కేటాయింపులను ప్రభుత్వం తగ్గిస్తున్నదని తెలిపారు. ఈ బడ్జెట్లో విద్యారంగ కేటాయింపులను నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర బడ్జెట్ గతేడాది కంటే 11 శాతం పెరిగిందని వివరించారు. ఆ రకంగా చూసినా విద్యారంగానికి రూ.28,266.48 కోట్లు కేటాయించాలని సూచించారు. కానీ రూ.16,085.69 (6.26 శాతం) కోట్లు కేటాయించిందని తెలిపారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, మహిళా, అటవీ విశ్వవిద్యాలయాలను నెలకొల్పడం శుభపరిణామమని పేర్కొన్నారు. వర్సిటీల అభివృద్ధికి నిధులు పెంచలేదని విమర్శించారు. కేటాయించిన నిధులు ఏ మూలకు సరిపోవని తెలిపారు. మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలని సూచించారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
విద్యకు తీవ్ర అన్యాయం : ఏఐఎస్ఎఫ్
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ స్టాలిన్, కార్యదర్శి శివరామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే తక్కువ నిధులను కేటాయిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి విశ్వవిద్యాలయానికీ రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పునరాలోచించి పెరిగిన బడ్జెట్‌కు అనుగుణంగా విద్యారంగ బడ్జెట్‌నూ పెంచాలని సూచించారు.
విద్యారంగాన్ని విస్మరించిన ప్రభుత్వం : పీడీఎస్‌యూ
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఎం పరశురాం, ప్రధాన కార్యదర్శి ఈ విజరుకన్నా విమర్శించారు. కొఠారి కమిషన్ చెప్పినట్టుగా విద్యకు 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని కోరారు. వర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని తెలిపారు.