Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బడ్జెట్లో గిరిజనులను ప్రభుత్వం దగా చేసిందనితెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మ నాయక్, ఆర్ శ్రీరామ్‌నాయక్ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. అంకెల్లో సైజు పెరిగినా ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి నిధులు పెంచకపోవడం గిరిజనులను మోసం చేయడమేనని తెలిపారు. వారికిచ్చిన హామీలను నెరవేర్చే విధంగా బడ్జెట్లో కేటాయింపులు లేవని పేర్కొన్నారు. గిరిజనుల జనాభా నిష్పత్తి (9.08 శాతం) ప్రకారం వారి ప్రత్యేక అభివృద్ధి నిధి కింద.. 30 ప్రభుత్వ శాఖలకు రూ. 17 వేల కోట్లకుపైగా కేటాయించాల్సి ఉండగా రూ. 12,565 కోట్లు మాత్రమే కేటాయించి అన్యాయం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం ఉపాధి వంటి సమస్యలు గిరిజన ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో ఉన్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో స్వయం ఉపాధికి రుణాలు ఇచ్చే ట్రైకార్ వంటి సంస్థలను అధిక నిధులు కేటాయించి బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం నామమాత్రపు కేటాయింపులే చేసిందని తెలిపారు. పేదలు సాగులో ఉన్న భూములకు హక్కులు కల్పించేందుకు లక్షలాది మంది రైతులతో ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించిందని గుర్తుచేశారు. ఆ ప్రక్రియని పూర్తిచేసి హక్కులు కల్పించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించక పోవడం అన్యాయమని తెలిపారు.
తండాల్లో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొత్తగా ఏర్పడిన 3,146 తండాల గ్రామపంచాయతీలకు కోటి రూపాయల చొప్పున బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదని పేర్కొన్నారు. మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధికి ఐటిడిఏల ఏర్పాటుకు తగిన నిధులు లేవని తెలిపారు. గత బడ్జెట్లో కేటాయించిన గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధుల్లో మూడు శాతం నిధులు కూడా ఖర్చు చేయకుండా ఇతర పథకాలకు వేల కోట్లను దారి మళ్లించిందని విమర్శించారు. ఖర్చు కానీ నిధులను తిరిగి ఈ ఏడాది బడ్జెట్లో కేటాయిస్తామన్న చట్టబద్ధ హామీని విస్మరించడం దారుణమని విమర్శించారు.