Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అబద్ధాలు చెప్పిండు..
- బీజేపీ సభ్యులను ఎందుకు సస్పెండ్ చేశారో అర్థంకాలే : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నేతిబీరకాయలో నేతి ఎంత ఉందో..కేసీఆర్ మాటల్లో నీతి అంతుందనీ, బడ్జెట్ ప్రసంగం పేజీలు పెంచిండనీ, అబద్ధాలు చెప్పాడనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ విమర్శించారు. బీజేపీ సభ్యులను ఎందుకు సస్పెండ్ చేశారో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. సోమవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'ట్రిపుల్ ఆర్' సినిమా ఇంకా రిలీజ్ కాలేదనీ, ట్రైలర్ చూసే సీఎం కేసీఆర్‌లో వణుకు పడుతున్నదని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా సభను కొనసాగించాలని అడగటం తప్పా? అని ప్రశ్నించారు. 'ఈ మాత్రం దానికి అసెంబ్లీ ఎందుకు? ప్రగతి భవన్లోనో, ఫాంహౌజ్ లోనే నీ కొడుకు, బిడ్డ, అల్లుడు, భజనపరులతో సభ పెట్టుకుంటే సరిపోతుందన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ పెట్టడం దారుణమని విమర్శించారు. మహారాష్ట్రలో 12మంది శాససభ్యులను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన విషయాన్ని గుర్తుచేశా రు.ఈ అంశంపై చట్టపరంగా, న్యాయపరంగా కొట్లాడతామనీ, కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, ఎంఐఎంలను అడ్డుపెట్టుకుని బీజేపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అన్నారు. ఇప్పటికైనా సీఎం కళ్లు తెరిచి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలనీ, బీజేపీ సభ్యులపై సస్పెండ్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.