Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్తంగా నేడు బడ్జెట్ ప్రతుల దహనం : ఎన్పీఆర్డీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
2022- 23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మోసం చేసిందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎం జనార్దన్‌రెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు కె. వెంకట్, ఎం అడివయ్య సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్లో ఐదు శాతం ప్రకారం రూ. 12,847,92 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆసరా పింఛన్ల కోసం నిధులు పెంచలేదని తెలిపారు. 2018 నుంచి పింఛన్ల కోసం 3.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.వీరందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పి, ఇప్పుడు నిధులు ఎందుకు పెంచలేదో చెప్పాలని ప్రశ్నించారు. గత ఏడాది బడ్జెట్లో స్త్రీ, శిశు, మహిళా, వికలాంగుల సంక్షేమానికి రూ. 1,702 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో ఎలాంటి నిధులను ప్రభుత్వం కేటాయించలేదని తెలిపారు. వివిధ వ్యాపారాలు, రిజర్వేషన్లకు సంబంధించి వాటిలో వికలాంగుల ప్రస్తావన లేదని పేర్కొన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాలను ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులున్నారనీ, వీరి సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా నేడు బడ్జెట్ పత్రాల దగ్ధం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వికలాంగుల సంక్షేమాన్ని విమర్శించటాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మంగళవారం బడ్జెట్ పత్రాలను దహనం చేయాలని వారు పిలుపునిచ్చారు.