Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరింత పకడ్బందీగా నరేగా పనులు
- మరిన్ని నిధులు రాబట్టడానికి అధికారుల కృషి
- ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ పనుల కల్పనలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందనీ, మరింత పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లితో పాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, చామకూర మల్లారెడ్డి, నామినేటెడ్ సభ్యులు సద్గుణ రవీందర్, అందె యాకయ్య, వెంకటనారాయణ గౌడ్, ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, ఇరిగేషన్ అడిషనల్ సెక్రటరీ శంకర్, పంచాయతీరాజ్ కమిషనర్ శరత్, ఈఎన్సీ సంజీవరావు, స్పెషల్ కమిషనర్ ప్రసాద్, సలహాదారు కొండల్ రావు, సొషల్ ఆడిట్ డైరెక్టర్ సౌమ్య, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు గతేడాది చేపట్టిన పనులను సమీక్షించారు. తగు సూచనలు, సలహాలిచ్చారు. కేంద్రం ఉపాధి హామీ నిధుల్లో రూ.25 వేల కోట్ల కోత పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం నిర్వహించే, మున్ముందు నిర్వహించబోయే పనులన్నింటికీ సరిపడా నిధులు రాబట్టాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధిక పని దినాలు, అత్యధిక మెటీరియల్ కాంపొనెంట్ని వినియోగించుకున్న మన రాష్ట్రం ఉపాధి హామీ పనుల్లో నెంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు. పల్లె ప్రగతి ద్వారా పల్లెల రూపు రేఖలనే మార్చేసి అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దామన్నారు. కరోనా కష్ట కాలంలో పట్టణాల నుంచి గ్రామాలకు వలసలు పెరిగాయనీ, తదనుగుణంగా పనులు, ఉపాధి కల్పించిన ఘనత కూడా తెలంగాణనదేనని వివరించారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ చట్టం అమల్లో ఉందని చెప్పారు. 2021-22 లో 28.3 లక్షల కుటుంబాలకు చెందిన 47.3 లక్షల మంది కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించామని తెలిపారు. 1.54 లక్షల కొత్తకార్డులు జారీ చేశామని చెప్పారు. కేంద్రం నిర్దేశించిన 13. 75 కోట్ల పనిదినాల లక్ష్యానికి గాను 13.85 కోట్ల పనిదినాలు పూర్తిచేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అదనంగా 50 లక్షల పని దినాలకు ఆమోదం తెలిపిందన్నారు.