Authorization
Fri March 21, 2025 02:22:13 am
- సర్కారు బడ్జెట్ కేటాయింపుల తీరు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అవును...సర్కారు మెట్రోరైల్‌ను చంకనెక్కించుకొని, ఆర్టీసీని వదులుకోవడానికి సిద్ధపడింది. బడ్జెట్లో ఆర్టీసీకి రెండు శాతం నిధులు కేటాయించాలని ఓవైపు కార్మిక సంఘాల జేఏసీ నేతలు గొంతులు చించుకొని అరుస్తుంటే, ప్రభుత్వం పట్టించుకోలేదు. అదే సమయంలో ప్రయివేటురంగంలోని హైదరాబాద్ మెట్రోరైల్ (హెచ్ఎమ్ఆర్)కు అడిగిందే తడవుగా 2022-23 బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించింది. అంతకుముందు ఏడాదుల్లోనూ మెట్రోకు ఏటా రూ.వెయ్యి కోట్లు చెప్పున కేటాయింపులు చేసింది. ఈసారి కూడా మెట్రో రైల్ కోసం ఆర్టీసీని బలి చేసేందుకు సిద్ధపడింది. రెండేండ్ల కరోనా, పెరిగిన డీజిల్ ధరల వల్ల ఆర్టీసీకి దాదాపు రూ.4,800 కోట్లు నష్టం వచ్చిందని స్వయంగా యాజమాన్యం ప్రకటించింది. దాన్ని భరించేందుకు సర్కారు సిద్ధపడలేదు. 2021-22 బడ్జెట్లో ఆర్టీసీకి రూ.1,500 కోట్లు, బడ్జెటేతర నిధులు (అప్పులు) కింద మరో రూ.1,500 కోట్లు ఇస్తామని ప్రకటించింది. బడ్జెట్ కేటాయింపుల్లో ఇప్పటి వరకు సంస్థకు రూ.990 కోట్లు మాత్రమే ఇచ్చింది. బడ్జెటేతర నిధుల పేరుతో ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్ల అప్పు ఇప్పించింది. ఫలితంగా ఇప్పటికే ఉన్న అప్పులకు కొత్త అప్పు తోడై మొత్తంగా రూ.2,900 కోట్ల అప్పు సంస్థకు మిగిలింది. ప్రతినెలా దానికి వడ్డీ, అసలు చెల్లించేసరికి తలప్రాణం తోకకు వస్తుంది. తాజాగా 2022-23 బడ్జెట్లో ఆర్టీసీకి రావల్సిన రీయింబర్స్మెంట్ కింద రూ.850 కోట్లు, ప్రభుత్వ గ్యారెంటీ రుణాలుగా మరో రూ.650 కోట్లు...మొత్తంగా రూ.1,500 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన రెండు ఫిట్మెంట్లు, ఆరు డిఏ బకాయిల ప్రస్తావనే లేదు. నిధుల కేటాయింపూ లేదు. కొత్త బస్సుల ఊసు అంతకంటే లేదు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్)కు ఇవ్వాల్సిన రూ.వెయ్యికోట్ల బకాయిల ప్రస్తావనా లేదు. ఈ కేటాయింపులపై తొమ్మిది కార్మిక సంఘాలతో కూడిన టీఎస్ఆర్టీసీ జేఏసీ తీవ్రంగా స్పందించింది. ఆర్టీసీ మనుగడపై ప్రభుత్వానికి చిత్తశుద్ధే లేదని ఘాటుగా విమర్శించింది. భవిష్యత్‌లో కార్మికోద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బడ్జెట్ కేటాయింపులపై టీఎస్ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎమ్‌యూ) కూడా తీవ్రంగా స్పందించింది. తాము ఆశించిన బడ్జెట్ ఇది కాదని ఆ సంఘం ఓ ప్రకటనలో నిరసన వ్యక్తం చేసింది.