Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరెంటు చార్జీల పెంపుకే సర్కారు మొగ్గు
- సబ్సిడీ సొమ్ము పెంచలే...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర బడ్జెట్లో ఇంధన శాఖకు అత్తెసరు కేటాయింపులే జరిగాయి. మొత్తం విద్యుత్‌లో 30 శాతం వినియోగదారుడిగా ఉన్న ప్రభుత్వం దానికి తగినట్టు నిధుల్ని కేటాయించలేదు. అలాగే వివిధ వర్గాలకు ఇచ్చే కరెంటు సబ్సిడీల సొమ్మునూ పెంచలేదు. ట్రాన్స్‌కో, డిస్కంలకు కలిపి సబ్సిడీగా రూ.7,767.25 కోట్లు మాత్రమే కేటాయించింది. దీనిలోనే వ్యవసాయ ఉచిత విద్యుత్, స్పిన్నింగ్ మిల్స్‌కు సహాయం వంటివి ఉన్నాయి. ఓవైపు వచ్చే అర్థిక సంవత్సరం నుంచి కరెంటు చార్జీలు పెంచాలని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)ని కోరిన విషయం తెలిసిందే. మొత్తం రూ.10వేల కోట్లకు పైగా ఆదాయ లోటును చూపిన డిస్కంలు వినియోగదారులపై దాదాపు రూ.6,800 కోట్ల మేరకు భారాలు వేస్తూ, చార్జీల పెంపునకు ప్రతిపాదనలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఈనెలాఖరుకు టీఎస్ఈఆర్సీ నిర్ణయం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సబ్సిడీ సొమ్ము పెరిగితే ఆ మేరకు వినియోగదారులపై ఆర్థిక భారాలు తగ్గుతాయని విద్యుత్ సంస్థలు భావించాయి. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరించింది. చార్జీలు పెంచుకొమ్మనమని పరోక్షంగా విద్యుత్ పంపిణీ సంస్థలకు గ్రీన్‌సిగల్ ఇస్తూ, సబ్సిడీ సొమ్మును పెంచలేదు. మరోవైపు పెట్టుబడి పద్దు క్రింద విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల రుణాలకోసం రూ.1,574 కోట్లు కేటాయించారు.