Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభానియమాలు ఉల్లంఘన
- సంప్రదాయాలకు తిలోదకాలు
- టీఆర్ఎస్ కార్యాలయంగా అసెంబ్లీ
- మీడియా పాయింట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''అసెంబ్లీ సమావేశాల్లో సభాపతి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. సభానియమాలకు తిలోదకాలు ఇచ్చారు. గతంలో ఏ స్పీకరూ ఈ రకంగా వ్యవహరించలేదు. పాయింట్ ఆప్ ఆర్డర్ లేవనెత్తితే కనీసం పట్టించుకోలేదు. సీఎల్పీ లీడర్ పట్ల ఎందుకీ వివక్ష? ఇది చట్ట సభనా? టీఆర్ఎస్ కార్యాలయమా?'' అంటూ శాసన సభ ఆవరణలోని మీడియా పాయింట్లో సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించారు. అనంతరం బయటకు వచ్చిన భట్టి మీడియాతో మాట్లాడుతూ సభలో నిబంధనలు పాటించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే మైక్ ఇవ్వలేదన్నారు. సభా గౌరవాన్ని మంటగలిపారని మండిపడ్డారు. అసెంబ్లీ ఏమైనా టీఆర్ఎస్ ఆఫీసా? అని ప్రశ్నించారు. ఇష్టానుసారం సభ నడపడం సరికాదనీ, సభాపతిని చూసి సిగ్గుపడుతున్నామని వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీని టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారని ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. స్పీకర్లు ప్రభుత్వానికి బంట్రోతులా మారుతున్నరా? అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో కూడా ఇలా ప్రవర్తించ లేదని గుర్తుచేశారు. స్పీకర్‌కు ప్రతిపక్షాల మీద చిన్నచూపు ఉందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తన మిత్రపక్షానికి ప్రతిపక్ష హోదా ఇస్తే గమ్మున కూర్చుందనీ... పాయింట్ ఆర్డర్ లేవనెత్తి తే కూడా తమ మొహం చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు జరిగిన అవమానంపై పోరాటం చేస్తామన్నారు. ''మా గొంతు నొక్కడం అంటే మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను అవమానించడమే'' అని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆర్టికల్ 176(1) ప్రకారం తమకు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తే అధికారం ఉందన్నారు. సమావేశాలు నడుపుతున్న తీరు బాధాకరమన్నారు. సభ వాయిదా పడ్డ తర్వాత రెండు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో సభ ప్రొరోగ్ కావాలన్నారు. కానీ ఐదు నెలలు దాటినా మన అసెంబ్లీ ఎందుకు ప్రొరోగ్ కాలేదో చెప్పాలని ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని వాపోయారు.ప్రజల పక్షాన మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వాపోయారు. సీఎం డైరెక్షన్లో స్పీకర్ బొమ్మలా నటిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులకే సభలో మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల గొంతు నొక్కడమంటే ప్రజల గొంతు నొక్కినట్లే నని చెప్పారు.రాష్ట్రంలో గుండా,రౌడీ పాలన సాగుతోంద న్నారు. కేసీఆర్ గ్యాంగ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నార ని..ఇది తెలంగాణ ప్రజలకు మంచిది కాదని..ప్రజలే కాంగ్రెస్‌ను కాపాడుకోవాలని సూచించారు. దళితుడు సీఎల్పీ లీడర్‌గా ఉంటే కేసీఆర్ చూడలేకపో యారని కోమటి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. వెయ్యిమంది బలిదానాలు కేసీఆర్ కుటుంబం పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోదెం వీరయ్య మాట్లాడుతూ కేసీఆర్ నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.