Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న కేంద్రం వివక్ష
- జాతీయహోదా లేనట్టే !
- సాగునీటి రంగానికి రూ.22,637 కోట్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ నిధులను రెండు రకాలుగా ఖర్చు చేయనుంది. నిర్వహణ పద్దు, ప్రగతి పద్దు కింద విడివిడిగా వ్యయం చేసేందుకు 2022-23 బడ్జెట్లో ప్రతిపాదించింది. మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ. 2.56 లక్షల కోట్లు కాగా, సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖకు గ్రాంట్ కింద రూ.22,637.82 కోట్లను కేటాయించింది. కానీ, ప్రగతిపద్దు కింద రూ.9,277.16 కోట్లను మాత్రమే చూపించింది. మిగిలిన డబ్బు నిర్వహణ పేరుతో వ్యయం చేయనున్నారు. రాష్ట్రంలోని 29 భారీ ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయింపులు ప్రతిపాదించారు. వీటితోపాటు నీటిపారుదల శాఖకు సంబంధించి మరో 15 అనుబంధ రంగాలకూ నిధులు చూపారు. అలాగే 49 మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులకు రూ.282.64 కోట్లు ఇచ్చారు.
మిగతా చిన్న నీటి తరహా ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ, సాగునీటి పారుదల అభివృద్ధి కార్పొరేషన్(ఐడీసీ), ఆయకుట్ట అభివృద్ధి, భూగర్భజలశాఖ, వరదలు, డ్రైనీజీ నిర్వహణ కోసం చూపించారు. మొత్తంగాను రూ.22,637.82 కోట్లు కేటాయించినా వాస్తవంగా ప్రాజెక్టులకు 2023 బడ్జెట్లో ఖర్చుపెడుతున్నది మాత్రం రూ.9.277.16 కోట్లే కావడం గమనార్హం. ప్రగతి పద్దు, నిర్వహణ పద్దు కలిసి చేసిన మొత్తం బడ్జెట్లో ఏ ఒక్క భారీ, మధ్య తరహా ప్రాజెక్టూ పూర్తయ్యే అవకాశం లేదు. ఈ ప్రాజెక్టులు రెండు దశాబ్ధాలుగా స్వల్ప మొత్తాలను మాత్రమే ఇస్తున్నారు. 2023 సంవత్సరంలో ఏఐబీపీ కింద కేంద్రం కేటాయించాల్సిన ప్రాజెక్టులు శ్రీరామసాగర్, జగన్నాథ్‌పూర్, మత్తడివాగు, బీమా ప్రాజెక్టుల్లో ఏ ఒక్క దానికి నిధులివ్వకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ సారీ రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధులు చూపారు.
కేంద్రం మొండిచేయి
కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర సాగునీటి రంగానికి మొండిచేయి చూపింది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు దాదాపు మూడేండ్లుగా సీఎం కేసీఆర్ సర్కారు అడుగుతున్నా జాతీయ హోదా ఇవ్వలేదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగంలో విమర్శించిన సంగతి తెలిసిందే. అంతేగాక వేగవంతమైన సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) నిధులకూ కోతపెట్టింది. యూపీఏ కాలం నుంచి కొనసాగుతున్న ఈ నిధులను 50 శాతం మేర కేంద్రం తగ్గించింది. దీనిపై సర్కారుతోపాటు సాగునీటి రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఏఐబీపీ ద్వారా భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే కార్యక్రమాన్ని దాదాపుగా నీరుగార్చింది. 1996-97లో యూఏపీ సర్కారు ఏఐబీపీ పథకానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులకు ఏఐబీపీ నిధులు వచ్చాయి.
ఇందులో నాలుగు భారీ ప్రాజెక్టులు కాగా, ఏడు చిన్న తరహావి. దాదాపు రూ.4,516.19 కోట్లు వచ్చాయి. 2005-06లో మాత్రం రూ.11,485.46 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఆ తర్వాత రూ.21,683.14 కోట్లుగా సవరించింది. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును గాలికొదిలేసింది. వీటికి ఏఐబీపీ నిధులను అడిగినా ఇప్పటివరకు కేంద్రం స్పందించకపోవడం తెలిసిందే.
ఆయా ప్రాజెక్టులకు కేటాయింపులు
రాష్ట్రంలోని పలు కీలకమైన ప్రాజెక్టులకు గత, తాజా బడ్జెట్లల్లో నిదులు కేటాయిస్తూ వస్తున్నది. ఇందులో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. పాలమూరు-రంగారెడ్డికి, కాళేశ్వరం, సీతారామ, డిండి, జూరాల పాకాల, లోయర్పెనుగంగ, ఎస్ఎల్బీసీ, బీమా, ఎల్లంపల్లి తదితర 70 పథకాలకు 2021-22లో రూ.6464.27 కోట్లు కేటాయించగా, 2022-23లో రూ.9277.16 కోట్లు ఇచ్చారు.