Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ రంగంలో మహిళలకు సమాన హక్కులు
- లైలైన్ మెన్లుగా 217 మంది నియామకం చారిత్రాత్మకం :మంత్రి కేటీఆర్
- ట్రాన్స్‌కో, జెన్కో ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో విద్యుత్ రంగం అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని, లింగ వివక్షత లేని సమాజ నిర్మాణం జరగాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. యావత్ ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా విద్యుత్ రంగంలో 217 మంది మహిళలకు లైన్మెన్లుగా అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఎస్ఆర్నగర్ జీటీఎస్ కాలనీలోని జెన్కో ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యుత్ రంగంలో జరిగిన నియామకాల్లో 9,644 మంది ఎంపికయితే.. అందులో 50% మహిళలు ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రభుత్వ రంగంలోని అన్ని శాఖలకు ఈ నియామకాలు ఆదర్శంగా నిలబడాలని ఆకాంక్షించారు. లింగ వివక్ష లేని సమాజ నిర్మాణం కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, సీఎం కేసీఆర్ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. మహిళల భద్రతకు తెలంగాణా పెట్టింది పేరు అని, సీఎం కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిన షీ-టీమ్స్,భరోసా కేంద్రాలు, ఆపద లో ఉన్న వారికి హాక్ ఐ మొబైల్ అప్లికేషన్లే అందుకు నిదర్శనమని చెప్పారు. లైన్మెన్ లుగా ఎంపికయిన మహిళలను మంత్రులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఇంధన శాఖా ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్‌కో అండ్ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్ పీడీసీఎల్సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీఎల్సీ సీఎండీ గోపాల్ రావు, జెన్కో ఎండీ శ్రీనివాసరావు, మహిళా ప్రతినిధులు విజయలక్ష్మి, భారతి తదితరులు పాల్గొన్నారు.