Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
సమాజంలో మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కడం లేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత పదవిలో ఉన్నవారు కూడా ఆ విధమైన గౌరవం పొందడం లేదన్నారు. రాజ్ భవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో.. మహిళా సాధికారతను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఏ మహిళ కూడా తన స్వార్థం కోసం ఏదీ కోరుకోదని, ప్రతిదీ తన కుటుంబం కోసమే కోరుకుంటుందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని, ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలని చెప్పారు. భవిష్యత్తు కోసం పొదుపు పాటించాలన్నారు. నిరాశ, నిస్పృహలో కూరుకుపోకుండా ప్రతి అడుగూ నూతనోత్సహంతో ముందుకు సాగాలన్నారు. ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. తెలంగాణ సోదరిగా తాను ఇక్కడి మహిళల జీవన విధానాన్ని ఎంతగానో ఇష్టపడతానని గవర్నర్ వెల్లడించారు. మహిళలు ప్రతి నిమిషాన్నీ ఆస్వాదించాలని.. ఆనందాన్ని దేని కోసం కూడా వదులుకోకూడదని సూచించారు. ఒక్కోసారి అవకాశం చేజారినా బాధపడాల్సిన అవసరం లేదని.. ఏదైనా సాధించాలనే తపన ఎప్పుడూ ఉండాలని అన్నారు. ఇప్పటికీ సమాజంలో మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారని, భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. భారతీయ మహిళ ఎవరికీ భయపడదు.. ప్రతి మహిళా ఆర్థిక స్వావలంబన దిశగా, సమానత్వం దిశగా అడుగేయాలని సూచించారు.