Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశతో ఎదురుచూస్తున్న లబ్దిదారులు
- 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు కుదింపుతో భారీగా ఆశావాహులు
- ఏటా భారీగా నిధులు..ఇవ్వడంలోనే జాప్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'వృద్ధాప్య పింఛన్ల మంజూరు కోసం విధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్దిదారులకు ఆసరా పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుంది. దానిని దృష్టిలో పెట్టుకునే ఆసరా పింఛన్ల కోసం 2022-2023 వార్షిక బడ్జెట్లో రూ.11,728 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం' అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చదివే సమయంలో మంత్రి హరీశ్‌రావు చెప్పిన మాటలతో పింఛన్ల కోసం దరఖాస్తులు పెట్టుకుని మూడు, నాలుగేండ్ల నుంచి ఎదురుచూస్తున్న లబ్ధిదారుల మొహాల్లో ఆశ చిగురించింది. కానీ, వరుసగా మూడేండ్ల నుంచి 'ఈసారి నుంచి ఇస్తాం' అనే మాట వినివినీ లబ్దిదారుల్లో ఈసారైనా ఇస్తారా? లేదా? అన్న ధర్మసందేహం మొదలైంది. అదే సమయంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్నారుగానీ..ప్రారంభం నుంచే ఇస్తారా? ఏ నెల నుంచి పింఛన్ డబ్బులు వేస్తారు? అనే విషయంలోనూ స్పష్టతలేకపోవడం గమనార్హం. పింఛన్లకు ఏటా రాష్ట్ర సర్కారు భారీగానే నిధులను కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో చూపెడుతున్నది. ఆ మేరకు ప్రతిసారీ నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఇవ్వడంలోనే రాష్ట్ర సర్కారు జాప్యం ప్రదర్శిస్తున్నదనే విషయం వరుసగా నాలుగేండ్ల నుంచి కేటాయింపులను చూస్తేనే అర్ధమవుతున్నది. పింఛన్ల కోసం రాష్ట్ర సర్కారు 2010-20లో రూ.9, 402 కోట్లు, 2020-21లో రూ. 11,758 కోట్లు, 2021-22లో రూ.11,728 కోట్లు కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.11,728 కోట్లను కేటాయించింది. వాటితో 50 లక్షల మందికైనా పింఛన్లు ఇవ్వొచ్చని సర్కారే చెబుతున్నది. ప్రతి బడ్జెట్ సందర్భంలోనూ కొత్త పింఛన్లను ఇస్తామని చెబుతూ పోతున్నది. కానీ, ఇవ్వట్లేదు. దీంతో పింఛన్ల కోసం దరఖాస్తు పెట్టుకుని ఎదురుచూస్తున్నవారు నిరాశపడటం షరామామూలైంది. అయితే, వచ్చే ఏడాది ఎన్నికలున్న నేపథ్యంలో ఈసారి కచ్చితంగా కొత్త పింఛన్లు ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. 'వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అందరికీ పింఛన్లు ఇస్తామని రాష్ట్ర సర్కారు చెబుతున్నది. అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇవ్వాలి. ఇన్ని రోజులు ఆగాం. ఇంకో 25 రోజులు ఆగలేమా? వేచి చూస్తాం. ఇస్తరా? ఇయ్యరా అనేది తేలుతుంది. ఇయ్యకపోతే పింఛన్ల దరఖాస్తు దారులతో ఆందోళన బాట పడుతాం. న్యాయపోరాటానికి కూడా సన్నద్ధమవుతాం' అని పింఛన్ల సాధన కమిటీ, రైతు స్వరాజ్యవేదిక నేత కొండల్‌రెడ్డి చెప్పారు.