Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఆత్మహత్యలు ఆగుడెట్టా?
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిన మాట మరచింది. దశలవారీగా రుణమాఫీ చేయకపోవడంతో రైతుపై భారం పడుతున్నది. తొలుత రూ 25వేల రుణమాఫీ చేసింది. మలివిడత రూ 50వేల లోపు రుణమాఫీ కొనసాగుతున్నది. ప్రస్తుతం బడ్జెట్లో రూ 75వేల అప్పులను మాఫీ చేస్తామంటూ ప్రకటించింది. అందు కోసం రూ 2,939 కోట్లు కేటాయించింది. రుణమాఫీ సకాలంలో చేయకపోవడంతో ఇప్పటికే రైతులు అప్పులయ్యారు. ప్రయివేటు అప్పుల బారిన పడుతూ ప్రాణాలు వదులుతున్నారు. దీంతో రైతుల ఆత్మహత్యలు ఆగుడెట్టా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బడ్జెట్లో దళితు బంధు గురించి గొప్పగా చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం...ఇటీవల కాలంలో కొనసాగుతున్న రైతు ఆత్మహత్య పట్ల కనీసం విచారం కూడా వ్యక్తంచేయలేదు. అంతా బాగుంది అనేది ప్రధానంగా ప్రస్తావించారు. వ్యవసాయంతో రైతుకు వస్తున్న కష్టాలను పేర్కొనలేదు. వ్యవసాయ భూములు ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం అందేలా 'రైతు బంధు' పథకానికి తాజా బడ్జెట్లో ప్రభుత్వం రూ 14,800కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో కూడా రైతు బంధు పథకానికి ఇవే నిధులు కేటాయించింది. ఈసారి లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కేటాయింపులు మాత్రం ఆ స్థాయిలో లేవు. దీంతో కొత్త పట్టాదారులకు రైతు బంధు కలగానే మిగలనుందా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సాగులో వస్తున్న వ్యవసాయ మార్పులను అందిపుంచుకునేలా యాత్రీకరణకు నిధులు కేటాయించలేదు. గత మూడేండ్లుగా ఇదే పరిస్థితి దాపురించింది. ఈసారైనా బడ్జెట్లో యాంత్రీకరణకు నిధులు ఉంటాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. గతేడాది బడ్జెట్లో రూ.1,250కోట్లు మంజూరు చేసి 34లక్షల మందికి రైతుబీమా కల్పించింది. ఈ ఏడాది మరో రూ.266కోట్లు అదనంగా కేటాయింపులు చేసింది. 2018 నుంచి రైతు బీమా పథకం అమలు చేస్తుండగా ఇప్పటి వరకు గత నాలుగేండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 75వేల మంది రైతులు మరణించారు. వీరికి రూ 5లక్షల చొప్పున ఇప్పటి వరకు రూ 3,775కోట్లు పరిహారం అందించినట్టు తెలిపింది. రైతు బీమా పథకానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.1,466కోట్లు కేటాయించింది. ఆ రైతుబీమాకు కష్టాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఉద్యానవన శాఖకు నాలుగైదేండ్లుగా బడ్జెట్లో కేటాయింపులు లేవు. సన్న, చిన్నకారు రైతులకు ఆసరాగా ఉండే ఆ శాఖ తీవ్ర నిర్లక్ష్యం చేసింది.
రెండేండ్ల కింద ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. మన ఊరు- మన కూరగాయాలు, పంట కాలనీలు పడకేశాయి. బిందుసేద్యాన్ని అందించలేదు. ఇవేవీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రైతులకు ఉపయోగపడే ఫాం ఆయిల్ సాగును ప్రోత్సహిస్తున్నది. అందుకోసం వెయ్యి కోట్లు కేటాయించింది. వ్యవసాయ మార్కెట్లకు నిధులు కేటాయించలేదు.దీంతో పంట కొనుగోళ్లు చేస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కూరగాయలు, మాంసం, చేపలు ఇలా అన్ని రకాలు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల కోసం గతేడాది రూ 500కోట్లు కేటాయించగా ఈఏడాది కేటాయింపులు చేయక పోవడం గమనార్హం.