Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీతభత్యాలు, పింఛన్లకే బడ్జెట్ కేటాయింపు
- విశ్వవిద్యాలయాలకు రూ859.55 కోట్లు ప్రతిపాదన
- గతేడాది కంటే పెరిగిన 232.24 కోట్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ప్రగతి కుంటుపడుతున్నది. నిధుల కేటాయింపులో ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. వర్సిటీల ప్రగతి కోసం ఒక్క రూపాయి కేటాయించకపోవడమే ఇందుకు నిదర్శనం. కొత్తగా ఏర్పాటు చేయబోయే మహిళా విశ్వవిద్యాలయానికి మాత్రం ప్రగతి పద్దు కింద రూ.వంద కోట్లు ప్రతిపాదించింది. 2022-23 బడ్జెట్లో రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాలకు నిర్వహణ పద్దు ఇంద రూ.759.55 కోట్లు కేటాయించింది. అందులో ఒక్క విశ్వవిద్యాలయానికి సైతం ప్రగతి పద్దు కింద ఒక్క రూపాయి కేటాయించ లేదు. వర్సిటీల పట్ల ప్రభుత్వానికి ఎంత చిన్నచూపు ఉందో అర్థమతున్నది. 2021-22లో విశ్వవిద్యాలయాల నిర్వహణ పద్దు కింద రూ.627.31 కోట్లు కేటాయించింది. అంటే గతంకంటే ఈ బడ్జెట్లో రూ.132.24 కోట్లు పెంచడం గమనార్హం. అయితే అన్ని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి రూ.1,200 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.650 కోట్లు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆ డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పెడచె విన పెట్టడం గమనార్హం. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీపైనా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇంకోవైపు ప్రయివేటు విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంలో మరిన్ని ప్రయివేటు వర్సిటీలు వచ్చే అవకాశమున్నది. వాటికి దీటుగా ప్రభుత్వ విశ్వవిద్యా లయాలను ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సింది పట్టించుకోవడం లేదు. ఒకవైపు నిధుల కొరత, ఇంకోవైపు అధ్యాపకుల్లేకపోవడంతో విద్యాప్రమాణాలు దిగజారుతున్నాయి. ప్రభుత్వ వర్సిటీల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారనుంది.
విశ్వవిద్యాలయాల వారీగా
(2022-23) నిధుల కేటాయింపు (కోట్లలో)
విశ్వవిద్యాలయం నిర్వహణ పద్దు ప్రగతి పద్దు మొత్తం
ఉస్మానియా రూ.418.06 రూ00 రూ.418.06
కాకతీయ రూ.118.21 రూ.00 రూ.118.21
అంబేద్కర్ రూ.17.53 రూ.00 రూ.17.53
పొట్టి శ్రీరాములు రూ.41.12 రూ.00 రూ.41.12
తెలంగాణ రూ.35.32 రూ.00 రూ.35.32
మహాత్మాగాంధీ రూ.25.82 రూ.00 రూ.25.82
శాతవాహన రూ.12.93 రూ.00 రూ.12.93
పాలమూరు రూ.9.85 రూ.00 రూ.9.85
జేఎన్టీయూ రూ.44.21 రూ.00 రూ.44.21
జేఎన్ఏఎఫ్ఏయూ రూ.24.12 రూ.00 రూ.24.12
ఆర్జీయూకేటీ రూ.24.12 రూ.00 రూ.24.12
మహిళ రూ.00 రూ.100 రూ.100.00
మొత్తం రూ.759.55 రూ.100.00 రూ.859.55