Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూపర్ స్పెషాలిటీలకు ప్రాధాన్యత
- వైద్యారోగ్యానికి రూ.11.237 కోట్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా మహమ్మారి నేర్పిన గుణపాఠం సర్కారుకు పూర్తి స్థాయిలో తలకెక్కినట్టు లేదు. ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతంగా లేకుంటే విపత్తులను ఎదుర్కోవడం ఎంత కష్టమో కోవిడ్-19 పాఠం కండ్ల ముందు కదలాడుతూనే ఉన్నది. మూడు దశల్లో విరుచుకుపడ్డ మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ స్పందించిన తీరుపై అనేక విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటారని అంతా ఆశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ నివేదిక, ఇతరత్రా సిఫారసుల మేరకు ప్రతి రాష్ట్రం బడ్జెట్లో ప్రజారోగ్యానికి కనీసం ఎనిమిది నుంచి 10 శాతం వరకు నిధులు కేటాయించాలి. ఈ సారి బడ్జెట్లో అది రూ.11,237 కోట్లు (4.3 శాతం)గా ఉంది. గతేడాది బడ్జెట్లో రూ.6,295 కోట్లు (3.4 శాతం)తో పోలిస్తే ఈ ఏడాది స్వల్పంగా 0.9 శాతం పెరగటమే కొంత ఊరట.
వైద్యారోగ్యశాఖ అభివృద్ధి కోసం నిధులను దాదాపు మూడు శాతం పెంచారు. గతంలో రూ.1933 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.5,748 కోట్లకు చేరింది. ఎంఎన్‌జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు గతంలో రూ.ఐదు కోట్లు ఉంటే, ఈ ఏడాది రూ.308 కోట్లకు పెంచారు. టిమ్స్‌కు నిధులను రూ.77 కోట్ల నుంచి రూ.203 కోట్లకు పెంచారు. ఆస్పత్రుల నిర్వహణకు గాను నాలుగు విభాగాలుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు రూ.300 కోట్లు, వైద్య పరికరాలకు రూ.500 కోట్లు, సర్జికల్ పరికరాలకు రూ.200 కోట్లు, ఔషధాలకు రూ.377 కోట్లు కేటాయించారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.1000 కోట్లు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి మరో రూ.1000 కోట్లు వెచ్చించనున్నారు. ఇవి కాకుండా మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి మెడికల్ కాలేజీలు ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయి. నిమ్స్‌లో మరో 2000 బెడ్లు పెంచనుండటంతో వాటి సంఖ్య 3,489కి చేరనున్నాయి. ప్రాథమిక ఆరోగ్య రంగంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బడ్జెట్‌ను రూ.మూడు కోట్ల నుంచి రూ.53 కోట్లకు పెంచారు. హెచ్ఎండీఏ పరిధిలో 94, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాల్టీలు, కార్పోరేషన్ల పరిధిలో మరో 60 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్నారు. టీబీ, క్యాన్సర్ తదితర రోగులకు పోషకాహారం అందించేందుకు ఒక బెడ్డుకు డైట్ ఛార్జీలను రూ.56 నుంచి రూ.112కు, ఇతర రోగులకు రూ.40 నుంచి రూ.80కి పెంచిన ప్రభుత్వం ఇందుకోసం రూ.43.5 కోట్లను కేటాయించింది. హైదరాబాద్‌లోని 18 మేజర్ ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల సహాయకులకు సబ్సిడీపై భోజన సదుపాయానికి రూ.38.66 కోట్లు, ఆస్పత్రుల్లో పారిశుధ్యానికి ఒక బెడ్డుకు రూ.5,000 నుంచి రూ.7,500 పెంచింది. ఇందుకోసం రూ.338 కోట్లను, 61 మార్చూరీల ఆధునీకరణకు రూ.32.50 కోట్లను ప్రతిపాదించింది.
ఉద్యోగుల పట్ల చిన్నచూపు...
కనీస వేతనాలు నిర్దిష్టంగా ప్రకటించాలి: టీయుఎంహెచ్‌ఇయూ
రాష్ట్ర బడ్జెట్లో వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూసిందని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ) విమర్శించింది. కనీస వేతనాలను నిర్దిష్టంగా ప్రకటించాలని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి భూపాల్, కె.యాదానాయక్ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సేవలందించే 108, 104 సేవల ప్రస్తావన బడ్జెట్ లో లేదనీ, కరోనా కాలంలో ప్రాణాలు ఫణంగా పెట్టిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఊసు మరిచారనీ, సిబ్బంది కరోనా ఇన్సెంటివ్‌లను విస్మరించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది సమస్యలను గురించి మాట్లాడకపోవడం, కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల పర్మినెంట్ అంశంతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్, ఇతర స్కీంలలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రత, వేతనాల ముచ్చటే లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పేషెంట్ కేర్, శానిటేషన్, స్వీపర్లు, సెక్యూరిటీ తదితరుల వేతనాలు పెంచాలన్న డిమాండ్ ప్రస్తావన లేదని పేర్కొన్నారు. సీఎం వేతనాలు పెంచడానికి నిర్ణయం తీసుకోవటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఒక్కో బెడ్డుకు పారిశుధ్యానికి రూ.5000 నుంచి రూ.7,500 కు పెంచుతూ అందుకోసం రూ.338 కోట్లు కేటాయించారని వివరించారు. అయితే కార్మికుల కనీస వేతనాలు నిర్దిష్టంగా ప్రకటించకపోవడం వల్ల కాంట్రాక్టర్లకే లాభం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
పేదలకు వైద్యమందించే బడ్జెట్: డాక్టర్ కిరణ్ మాదాల
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బడ్జెట్ పేదలకు వైద్యఖర్చుల భారాన్ని తగ్గిస్తుందని ఆరోగ్యరంగ విశ్లేషకులు డాక్టర్ కిరణ్ మాదాల అభిప్రాయపడ్డారు. వైద్య ఖర్చులు భరించలేక ప్రతి ఏడాది 50 లక్షల మంది పేదరికంలోకి బలవంతంగా నెట్టబడుతున్నారనే విషయాన్ని నివేదికలు చెబుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితి నుంచి గట్టేక్కేందుకు ప్రయివేటును ఆశ్రయించే బాధ నుంచి తప్పించేలా జిల్లా ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచేందుకు నిర్ణయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో వైద్యారోగ్యశాఖ బడ్జెట్‌ను మరింత పెంచాల్సిన అవసరముందని సూచించారు.
ఆరోగ్యరంగ ముఖచిత్రం మార్చే బడ్జెట్
సీఎంకు, హరీశ్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు: డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు
రాష్ట్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి 4.5 శాతం కేటాయించడం శుభపరిణామమనీ, ఆ శాఖ ముఖచిత్రాన్ని మారుస్తుందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు.ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యరంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుకు వైద్యారోగ్యశాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఔషధాలు, రోగ నిర్ధారణ పరికరాలు, డయాగస్టిక్ రీఏజెంట్స్ కోసం కేటాయించిన రూ.1,400 కోట్లతో పేద రోగులకు మేలు కలుగుతుందని తెలిపారు. ఒక్కో జిల్లాకు ఒక్కో వైద్య కళాశాల ఏర్పాటుతో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అప్ గ్రెడేషన్, మౌలిక సదుపాయాల కోసం రూ.250 కోట్లు కేటాయించడమే కాకుండా అన్ని జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు తేవాలన్న నిర్ణయంతో ప్రాథమిక ఆరోగ్య రంగం బలోపేతం అవుతుందన్నారు. ప్రాథమిక దశలోనే రోగాలను గుర్తించి చికిత్స అందించే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు.