Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది కంటే తగ్గిన 0.5 శాతం నిధులు
- ఈ బడ్జెట్లో రూ.16,085 కోట్లు ప్రతిపాదన
- మహిళా విశ్వవిద్యాలయానికి రూ.వంద కోట్లు
- రూ.7,289 కోట్లతో దశలవారీగా 'మన ఊరు-మనబడి' అమలు
- మొదటిదశలో రూ.3,497 కోట్లతో 9,123 స్కూళ్ల అభివృద్ధి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యారంగానికి నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వం కోత విధించింది. 2022-23 బడ్జెట్లో ఆ రంగానికి రూ.16,085.69 (6.26 శాతం) కోట్లు ప్రతిపాదించింది. ఇందులో పాఠశాల విద్యకు రూ.13,727.97 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.394.93 కోట్లు, ఉన్నత విద్యకు రూ.1,962.78 కోట్లు కేటాయించింది. 2021-22 బడ్జెట్లో విద్యారంగానికి సర్కారు రూ.15,608 (6.76 శాతం) కోట్లను ప్రతిపాదించింది. అంటే గత బడ్జెట్ కంటే ఇప్పుడు 0.5 శాతం నిధులను తగ్గించింది. కానీ అంకెల్లో మాత్రం విద్యారంగ కేటాయింపులు పెరిగినట్టుగా కనిపిస్తుంది. గత బడ్జెట్ కంటే ఇప్పుడు రూ.477 కోట్లు మాత్రమే పెరిగాయి. మొత్తం బడ్జెట్ రూ.2,56,958 కోట్లలో విద్యారంగానికి రూ.16,085 (6.76 శాతం) కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. కొఠారి కమిషన్ సిఫారసుల ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి. ఆ లెక్కన ఈ బడ్జెట్లో 77,087.4 కోట్లు ప్రతిపాదించాలి. తెలంగాణ ఆవిర్భావం నుంచి విద్యారంగ కేటాయింపులు ఆ దిశగా లేవు. ఆ సిఫారసులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. 2014-15లో రూ.1,00,637 బడ్జెట్ ప్రతిపాదించగా, విద్యారంగానికి రూ.10,956 (10.88 శాతం) కేటాయించింది. ఆ లెక్కన 10.88 శాతం నిధులను ఈ బడ్జెట్లో కేటాయించినా 27,957 కోట్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా చర్యల్లేవు. 2014-15లో 10.88 శాతం, 2015-16లో 9.69 శాతం, 2016-17లో 8.23 శాతం, 2017-18లో 8.49 శాతం, 2018-19లో 7.61 శాతం, 2019-20లో 6.76 శాతం, 2020-21లో 6.63 శాతం, 2021-22లో 6.76 శాతం, ఇప్పుడు 6.26 శాతం నిధులను కేటాయించింది. ఇలా అరకొర నిధులతో విద్యారంగం ఎలా అభివృద్ధి చెందుతుందని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కనీసం 20 శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
సర్కారు బడుల బలోపేతంపై సర్కారు దృష్టి
గురుకుల విద్యకు మొదటిదశలో పెద్దపీట వేసిన ప్రభుత్వం రెండోదశలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా దృష్టికేంద్రీకరించింది. అందులో భాగంగానే 'మన ఊరు-మనబడి'అనే బృహత్తర విద్యా పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.7,289 కోట్లతో దశలవారీగా పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతున్నది. ఇది గ్రామస్థాయిలో అయితే 'మన ఊరు-మనబడి', పట్టణాల్లో అయితే 'మనబస్తీ-మనబడి' అనే పేరుతో అమలవుతుంది. మొదటిదశలో మండలాన్ని యూనిట్‌గా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో రూ.3,497 కోట్లతో కార్యాచరణ ప్రారంభించింది. 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సకల హంగులతో సుందరంగా తీర్చిదిద్దుతున్నట్టు ప్రకటించింది.
మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు
ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.వంద కోట్లు ప్రతిపాదించింది. కోఠి మహిళా కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన నాటికి రాష్ట్రంలో ఒక్క ఫారెస్టు కాలేజీ లేదని తెలిపింది. ఈ లోటును గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ములుగులో ఫారెస్టు కాలేజీని ఏర్పాటు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా అటవీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ బడ్జెట్లో రూ.వంద కోట్లు ప్రతిపాదించింది.
విద్యారంగానికి ఏటా బడ్జెట్ కేటాయింపులు (కోట్లలో)
ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ విద్యకు కేటాయింపు శాతం
2014-15 రూ.1,00,637 రూ.10,956 10.88
2015-16 రూ.1,15,689 రూ.11,216 9.69
2016-17 రూ.1,30,415 రూ.10,738 8.23
2017-18 రూ.1,49,646 రూ.12,705 8.49
2018-19 రూ.1,74,453 రూ.13,278 7.61
2019-20 రూ.1,46,492 రూ.9,899 6.76
2020-21 రూ.1,82,914 రూ.12,127 6.63
2021-22 రూ.2,30,825 రూ.15,608 6.76
2022-23 రూ.2,56,958 రూ.16,085 6.26