Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ ఆదాయంపై మరోసారి భారీ అంచనాలు
- రూ.1,89,274 కోట్లు వ్యయం చేస్తామంటూ ప్రతిపాదన
- నమ్మకాన్ని ప్రోది చేసుకునేందుకు తిప్పలు
- అందుకే మరోసారి భారీ పద్దు
- రూ.25 వేల కోట్ల మేర కేంద్ర గ్రాంట్లపై ఆశలు
- భూముల అమ్మకాల ద్వారా రూ.15 వేల కోట్లు వస్తాయంటూ ఊహలు
బి.వి.యన్.పద్మరాజు
'నమ్మకమే జీవితం...' ఒక బంగారు ఆభరణాల షోరూమ్‌కు సంబంధించిన వ్యాపార ప్రకటనలో సినీ నటుడు నాగార్జున వాడే డైలాగ్ ఇది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే డైలాగ్‌ను బడ్జెట్‌కు అన్వయించుకున్నది. అందుకే ప్రజల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకునేందుకు నానా పాట్లు పడుతున్నది. అందులో భాగంగానే ఆదాయం రావటం లేదని తెలిసినా.. ఇంతకుముందు లెక్కలు, గణాంకాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నా పట్టించుకోకుండా మరోసారి భారీస్థాయిలో పద్దును పెంచి చూపారు. ఈ క్రమంలో విత్త మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముచ్చటగా మూడోసారి 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన పద్దు... రూ.2,56,958.51 కోట్లకు ఎగబాకింది. 2021-22తో పోలిస్తే (రూ.2,30,825 కోట్లు) ఇది రూ.26,133 కోట్లు ఎక్కువ. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయా(నిర్వహణ పదుద)న్ని రూ.1,89,274 కోట్లుగానూ, క్యాపిటల్ వ్యయా(ప్రగతి పద్దు)న్ని రూ.29,728 కోట్లుగానూ ప్రతిపాదించారు. ఇక్కడే అసలైన గమ్మత్తు దాగుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని(2021-22)కి సర్కారు మొత్తం రూ.1,76,126 కోట్ల మేర రెవెన్యూ ఆదాయం వస్తుందంటూ అంచనాలేసుకుంది. కానీ ఈ యేడాది జనవరి నాటికి అందులో రూ.98,282 కోట్లే వచ్చాయి. అంటే సర్కారు వేసుకున్న అంచనాల్లో ఇంకా రూ.77,844 కోట్లు రెవెన్యూ ఆదాయం రూపంలో రావాలన్నమాట. గతనెలతోపాటు ప్రస్తుత మార్చిని కూడా పరిగణలోకి తీసుకున్నా... అంత మేర ఆదాయం రావటమనేది అసాధ్యం. ఒకవేళ వచ్చినా అది రూ.లక్షా 10 వేల కోట్లు లేదా రూ.లక్షా 20 వేల కోట్లకు మించే అవకాశమే లేదు. అంటే ఏ రూపంలో చూసినా రెవెన్యూ ఆదాయంలో సుమారు రూ.50 వేల కోట్లు బోగస్సేనన్నమాట. అలాంటప్పుడు వాస్తవాలను మరిచి.. మళ్లీ ఇప్పుడు రెవెన్యూ ఆదాయంపై భారీ అంచనాలేసుకుని... ఆమేరకు రూ.1,89,274 కోట్ల రెవెన్యూ వ్యయం చేస్తామని చెప్పటం ప్రజలను భ్రమలకు గురి చేయటమే అవుతుంది. దీంతోపాటు తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నది, నిధులు విడుదల చేయటం లేదని చెప్పిన ఆర్థిక మంత్రే.. అదే మోడీ సర్కారుపై గంపెడాశలు పెట్టుకుని అతి అంచనాలకు పోయారు. ఉన్న నిధులకే దిక్కు లేదని మొత్తుకుంటుంటే... ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం రూ.25 వేల కోట్లు (కేంద్ర గ్రాంట్ల పద్దు కింద) ఇస్తుందంటూ బడ్జెట్లో రాసుకున్నారు. రాష్ట్రాల పట్ల, వాటి హక్కుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్న కేంద్రం... ఇందులో హరీశ్‌రావు వేసుకున్న రూ.25 వేల కోట్లలో ఒక్క రూపాయినైనా విదుల్చుతుందా..? అన్నది ఇప్పటికైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే. మరోవైపు భూముల అమ్మకాల ద్వారా గత ఏడేండ్ల కాలంలో వచ్చింది నామమాత్రమే. 2021-22లో కూడా ఇందుకు సంబంధించి ఇప్పటిదాకా వచ్చింది కేవలం రూ.0.13 కోట్లే. అయినా ఈ వాస్తవాన్ని పట్టించుకోకుండా రాబోయే బడ్జెట్లో భూముల అమ్మకాల ద్వారా భారీ స్థాయిలో రూ.15 వేల కోట్లు వస్తాయంటూ అతి అంచనాకు పోయారు. ఇదెలా సాధ్యమనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి ఇలా ప్రభుత్వం ఊహల పల్లకిలో ఊరేగుతూ.. ప్రజల్ని కూడా ఊహల్లో విహరింపజేయటం రాష్ట్రానికి అంత మంచిది కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి అనేవి తమ ప్రభుత్వానికి రెండు కండ్ల లాంటివని చెబుతున్న సర్కారు వారు... పేదలకు ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు, ఇస్తున్న సబ్సిడీలు, రాయితీలను సక్రమంగా, పకడ్బందీగా అమలు చేయాలని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతమున్న ఇలాంటి స్కీములకే నిధులను సకాలంలో విడుదల చేయలేని సర్కారు... రెవెన్యూ వ్యయాన్ని భారీ స్థాయిలో చూపటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.