Authorization
Thu March 13, 2025 02:45:18 am
- అడ్రియాల బొగ్గుగనిలో ఘోర ప్రమాదం
- ఇద్దరు అధికారులు, ఉద్యోగి, కాంట్రాక్టు కార్మికుడు
- స్వల్ప గాయాలతో బయట పడిన ఐదుగురు
- రామగుండం రీజియన్-3లో ఘటన
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి/రామగిరి
పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్- 3 పరిధిలోని ఆండ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు గనిలో సోమవారం మొదటి షిప్టులో ఘోర ప్రమాదం సంభవించింది. నలుగురు బొగ్గు పెళ్లల కింద చిక్కుకుపోయారు. ఇందుకు సంబంధించి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. గనిలోని 86 లెవెల్/ ఆర్ఏ 3 పని స్థలం వద్ద సైడ్ రూప్ కూలకుండా రక్షణ చర్యలను చేపట్టారు. అందులో భాగంగా ఇనుప జాలితో బొగ్గు పరదాలు కూలకుండా సపోర్ట్‌మెన్ కార్మికులతో పనులను నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం సుమారు 1.30గంటల సమయంలో పని స్థలంలో అనూహ్యమైన శబ్దాలు రావటం ఏరియా రక్షణాధికారి గమనించి కార్మికులను అక్కడి నుంచి తప్పుకోవాలని అప్రమత్తం చేశారు. అంతలోనే భారీ శబ్దంతో 20 మీటర్ల పొడవు, మూడు మీటర్ల మందంతో బొగ్గు పరదా ఒక్కసారిగా కూలింది. ఏరియా రక్షణాధికారి జయరాజు హెచ్చరికతో సపోర్ట్ పనులు నిర్వహిస్తున్న కార్మికులు వీరయ్య (సపోర్ట్ మెన్), మధు, శశి(బదిలీ వర్కర్లు) ఘటనా స్థలం నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. బొగ్గు పెళ్లల కింద సపోర్ట్‌మెన్ కార్మికుడు రవీందర్, పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు జయరాజు, తేజ, కాంట్రాక్ట్ కార్మికుడు శ్రీకాంత్ ఉన్నట్టు సమాచారం. ప్రమాద వార్త తెలిసిన వెంటనే సింగరేణి రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దింపి బొగ్గు పెళ్లల కింద చిక్కుకున్న మైనింగ్ సూపర్వైజర్ నరేష్, ఎఫ్బిఎల్ఆపరేటర్ వెంకటేశ్‌ను కాపాడారు. వారిని ఆస్పత్రికి తరలించారు. బొగ్గుపెళ్లల కింద చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ సిబ్బందితోపాటు, గని కార్మికులను వినియోగిస్తున్నారు. సింగరేణి ఉన్నతాధికారులు, కార్మిక నాయకులు గనిపై మకాం వేసి ప్రమాదంలో రక్షణ చర్యలు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రక్షణ చర్యల్లో తామూ..
రక్షణ చర్యల్లో తామూ పాలుపంచుకుంటామని గనిలోనికి వెళ్లడానికి ప్రయత్నించిన వివిధ కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అనుమతించలేదు. గుర్తింపు కార్మిక సంఘం, ఇతర కార్మిక సంఘాల నాయకుల ఆందోళనతో కొంతమంది కార్మిక ప్రతినిధులను మాత్రం గనిలోకి వెళ్లడానికి అనుమతించారు.
యాజమాన్యం నిర్లక్ష్యంతో ప్రమాదం : కార్మిక సంఘాలు
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సీఐటీయు, ఏఐటీయూసీ, టీబీజీకెఎస్, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.