Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏకపక్షంగా శాసనసభ నిర్వహణ
- గవర్నర్ ప్రసంగం లేదు
- కాంగ్రెస్ వాకౌట్.. బీజేపీ సభ్యుల సస్పెన్షన్
- ఓయూలో అలజడి
- ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్
- సీఎం కాన్వారును అడ్డుకునేయత్నం
- పోలీసు పహారాతో అసెంబ్లీ సమావేశాలు షురూ..
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
శాసనసభ ప్రారంభమైన తొలిరోజే ప్రభుత్వం సభా నిర్వహణపై స్పష్టతనిచ్చేసింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే, నిలదీస్తే, నిరసిస్తే సహించేదిలేదని ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరికనే పంపింది. దీన్ని ముందే పసిగట్టిన కాంగ్రెస్ సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ మైక్ కోసం నినాదాలు చేసినా స్పీకర్ పట్టించుకోకపోవడంతో వారు సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కేంద్రప్రభుత్వంపై సభలో తీవ్ర విమర్శలు చేస్తుండటాన్ని నిరసిస్తూ వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు, నల్లకండువాలు వేసుకొని తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేసిన రఘునందనరావు, ఈటల రాజేందర్‌ను సమావేశాలు ముగిసేవరకు స్పీకర్ సస్పెండ్ చేశారు. దీనితో సభలో టీఆర్ఎస్, అనధికార మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం సభ్యులు తప్ప ఎవరూ మిగల్లేదు. ఇక శాసనసభలో ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంతకుముందు వారిద్దరూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం హైలెట్. రెండు సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ఈసారి బీజేపీ సభ్యుడిగా సభకు హాజరయ్యారు. ఆయన సభలోకి వచ్చే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సాధ్యమైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నించారు. కొందరు ఎమ్మెల్యేలు ఈటలను అలింగనం చేసుకొని 'వెల్కం' చెప్పారు. మరోవైపు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలంగాణ ప్రజలకు బడ్జెట్ శుభాకాంక్షలు తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకున్న ఆమె అక్కడే మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడంపై ఇప్పటికే స్పష్టత ఇచ్చినట్టు ఆమె చెప్పారు. అన్ని వర్గాల ప్రజల ఆశలు ఈ బడ్జెట్ ద్వారా నెరవేరాలని ఆకాంక్షించారు. తాను తమిళనాడుకు చెందిన వ్యక్తిని అయినా రెండేండ్లుగా తెలంగాణ ప్రజలతో మమేకమై ఉన్నానని ఆమె వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై కాంగ్రెస్‌పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. గవర్నర్‌కే దిక్కులేకపోతే సభ్యుల సంగతి ఏంటని కాంగ్రెస్ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం లేకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఉదయం 11 గంటల 32 నిముషాలకు ప్రవేశపెట్టారు. ఆయన మూడోసారి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతో కేసీఆర్ చేసిన పోరాటాన్ని ప్రస్తుతిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. కేంద్రప్రభుత్వంపై ముప్పేటదాడి చేశారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రాపాలకుల నుంచి వివక్షను ఎదుర్కొంటే, స్వరాష్ట్రంలో కేంద్రం నుంచి అదే వివక్షను ఎదుర్కుంటున్నామని విమర్శలు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను రూ.2,56,958.51 కోట్లుగా ఆయన ప్రకటించారు. దానిలో రెవెన్యూ వ్యయం రూ.1,89,274.82 కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం రూ.29,728.44 కోట్లుగా చూపారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సభలో ప్రతిపాదించగా, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దాన్ని ప్రకటించారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు ఎదుట బైఠాయించి, ధర్నా చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేసి బొల్లారం పోలీస్టేషన్‌కు తరలించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్న సమయంలో ఆయన కాన్వారుని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత అర్జున్ నాయక్ అడ్డుకొనే ప్రయత్నం చేశారు. తక్షణం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని కాన్యారుకు అడ్డంగా పరిగెడుతూ నినాదాలు చేశారు. పోలీసులు వెంట పరిగెత్తి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోనూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు చలో అసెంబ్లీ నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించే ప్రయత్నం చేసారు. పోలీసులు యూనివర్సిటీ గేట్లు మూసేసి, ఎక్కడివారిని అక్కడే అరెస్టులు చేశారు. ఆర్థికమంత్రి హరీశ్‌రావు రెండుగంటలపాటు సుదీర్ఘంగా బడ్జెట్‌ను చదివారు. అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించి, మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను కలిసి, సభా నిర్వహణపై ఫిర్యాదు చేశారు.