Authorization
Fri March 21, 2025 03:03:58 am
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బడ్జెట్లో వివిధ వర్గాలకు ఆకర్షణీయమైన తాయిలాలు ప్రకటించినా టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. స్వంతస్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి రూ.ఆరు లక్షలిస్తామనీ టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించి ఇప్పుడు రూ.మూడు లక్షలతో సరిపెట్టడం దారుణమని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను వంచించిందని పేర్కొన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ప్రకటన లేకపోవడం అన్యాయమని విమర్శించారు.
మెరుపుల బడ్జెట్ : ప్రజాపంథా
ప్రభుత్వం మెరుపుల బడ్జెట్ను ప్రవేశపెట్టిందని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. బడ్జెట్ లక్ష్యాలు ఘనంగా ఉంటున్నా ఆచరణ పాక్షికంగా ఉంటున్నదని విమర్శించారు. ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యల్లేవని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి చెల్లించాలనే ప్రణాళిక లేదని తెలిపారు. మార్కెట్ సమస్య, గిట్టుబాటు ధర ఊసేలేదని పేర్కొన్నారు. రైతుబంధుతో సరిపెట్టారని వివరించారు. కూలీలకు సమగ్ర చట్టం ఊసేలేదని పేర్కొన్నారు.
గారడీ బడ్జెట్ : న్యూడెమోక్రసీ
ప్రజలను దగా చేస్తున్న గారడీ బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు తెలిపారు. దళితబంధు, సంక్షేమ రంగాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నట్టుగా చూపి ప్రజలను అంకెల గారడీతో మోసం చేస్తున్నారని విమర్శించారు. మరోసారి భ్రమలకు గురిచేసి రానున్న ఎన్నికల్లో ఓట్లను కొల్లగొట్టడానికి ఉద్దేశించేలా ఉందని పేర్కొన్నారు.