Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పన్నుల ఆదాయం పెంచడంతో ప్రజలపై భారాలు
- ప్రతిపాదనలను సవరించాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ భ్రమలు కల్పించేదిగా ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రూ.2,56,958 కోట్లతో ఆర్థిక మంత్రి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 బడ్జెట్‌ను సవరించి రూ.2,09,982.61 కోట్లకు తగ్గించారని వివరించారు. అంటే రూ.21 వేల కోట్లు (పదిశాతం) తగ్గిందని పేర్కొన్నారు. ప్రధానంగా పన్నేతర ఆదాయం, గ్రాంట్లు రూ.60 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్ల వరకు పెంచి చూపుతున్నారని తెలిపారు. 2020-21లో పన్నేతర ఆదాయం రూ.30,557 కోట్లు పదకొండు మాసాల్లో వచ్చిన ఆదాయం రూ.5,600 కోట్లు మాత్రమేనని వివరించారు. అలాగే గ్రాంట్ల కింద రూ.38,669 కోట్లు అంచనా వేసుకోగా వచ్చిన ఆదాయం రూ.7,200 కోట్లని తెలిపారు. ఈ పరిస్థితిని గమనించి సవరించిన బడ్జెట్లో రూ.21 వేల కోట్లు తగ్గించి చూపారని పేర్కొన్నారు. పన్నుల ఆదాయం రూ.93 వేల కోట్ల నుంచి రూ.లక్షా ఎనిమిదివేల కోట్లకు పెంపుదల చేసి ప్రజలపై భారాలు వేయనున్నారని విమర్శించారు.
ప్రతి కుటుంబానికీ ఇల్లు నిర్మిస్తామనీ, ఎమ్మెల్యే పరిధిలో 3.75 లక్షల ఇండ్లు, నిర్వాసితులకు 43 వేల ఇండ్లు నియోజకవర్గానికి మూడువేల ఇండ్ల చొప్పున నిర్మిస్తామంటూ ప్రభుత్వం చెప్పిందని తమ్మినేని గుర్తు చేశారు. తయారైన డబుల్బెడ్రూం ఇండ్లనూ లబ్దిదారులకు పంపిణీ చేయడం లేదని తెలిపారు. ఎంతోకాలం వేచిచూసిన ప్రజలు విసుగుచెంది ఆక్రమణలనకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఏడేండ్లు గడిచినా ఇండ్లసమస్యగానీ, దళితుల మూడెకరాల భూపంపిణీగానీ, అందరికీ విద్యావైద్యంగానీ కల్పించలేదని విమర్శించారు. స్వంతస్థలంలో ఇండ్లు నిర్మించుకునే పేదలకు రూ.ఐదు లక్షలిస్తామని గతంలో హామీ ఇచ్చి ఈ బడ్జెట్లో రూ.మూడు లక్షలకు పరిమితం చేయడం సరైంది కాదని తెలిపారు.
బడ్జెట్ పెంచి దళిత, గిరిజన, బీసీలు, మహిళలు, విద్యారంగానికి భారీ కేటాయింపులు చూపుతున్నారని తమ్మినేని విమర్శించారు. ఆచరణలో తగ్గిస్తున్నారని తెలిపారు. 2014 నుంచి 2020 వరకు దళితులకు కేటాయించింది రూ.55 వేల కోట్లుకాగా, ఖర్చు చేసింది రూ.32 వేల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. బలహీనవర్గాల సంక్షేమ పథకాల్లో ఇదే విధమైన కోతలు కొనసాగుతున్నాయని వివరించారు. రైతు ఆత్మహత్యల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, నిధుల కేటాయింపు వివరాలు ఈ బడ్జెట్లో లేవని తెలిపారు. ఆరోగ్యశ్రీని రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షలకు ప్రకటించిన ఆర్థిక మంత్రి అనేక రోగాలను ఈ పథకం నుంచి మినహాయించారని వివరించారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి మద్యం అమ్మకాలపైనా, భూముల రిజిస్ట్రేషన్‌పైనా విపరీతమైన పెంపుదల చూపారని పేర్కొన్నారు. ఇవి పేదల మీద భారం చూపుతాయని తెలిపారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి 2023, మార్చి నాటికి బడ్జెట్ పత్రాల్లో రూ.3,29,998 కోట్లు చూపారని వివరించారు. కానీ బడ్జెటేతర అప్పులు, కార్పొరేషన్ల అప్పులతో కలిపి రూ.నాలుగు లక్షల కోట్లు అప్పలున్నాయని గుర్తు చేశారు. ఈ బాకీల కింద రూ.18,911 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సరం పెట్టుబడి ఆదాయం అంటే అప్పుల ద్వారా ఆదాయం రూ.63,832 కోట్లు చూపారని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికీ, ఉపాధి కల్పనకు కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. దళితులకు సబ్‌ప్లాన్ కింద రూ.34 వేల కోట్లు కేటాయింపు చూపినా వారి కోసం ఖర్చు చేస్తున్నది తక్కువేనని పేర్కొన్నారు. గిరిజనులకు రూ.13 వేల కోట్లు కేటాయించారని వివరించారు. దళిత, గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ నిధులుగానీ, సబ్‌ప్లాన్ నిధులుగానీ ఒకచోట చేర్చి నోడల్ ఆఫీసర్‌ను నియమించి వారి అభివృద్ధికి ఖర్చు చేయాలని సూచించారు. అప్పుడు మాత్రమే ఫలితం ఉంటుందని తెలిపారు. ఆ వైపుగా బడ్జెట్ ప్రతిపాదనలను సవరించాలని డిమాండ్ చేశారు.